హైదరాబాద్ లో లావా మొబైల్స్ పరిశోధన కేంద్రం..
♦ తిరుపతి ప్లాంటు 2018కల్లా రెడీ
♦ లావా వైస్ ప్రెసిడెంట్ సందీప్ డోంగ్రె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల విక్రయంలో ఉన్న లావా ఇంటర్నేషనల్ సంస్థ హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్‌అండ్‌డీ) ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. చర్చలు పురోగతిలో ఉన్నాయని, ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని లావా వైస్ ప్రెసిడెంట్ సందీప్ డోంగ్రె గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రతిపాదిత కేంద్రంలో 200 మందిని నియమిస్తామని చెప్పారు. ఇప్పటికే కంపెనీకి బెంగళూరులో 400 మందితో కూడిన ఆర్‌అండ్‌డీ సెంటర్ ఉంది. వచ్చే మూడేళ్లలో పరిశోధన, అభివృద్ధిపై రూ.200 కోట్లు ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. ఇక 4జీ విషయానికి వస్తే ప్రస్తుతం నాలుగు మోడళ్లు ప్రవేశపెట్టామన్నారు. వచ్చే త్రైమాసికంలో మరో మూడు మోడళ్లు రానున్నాయని వివరించారు. విక్రయాల పరంగా 70 శాతం వాటా ఫీచర్ ఫోన్లదేనని ఆయన చెప్పారు.
నెలకు 50 లక్షల యూనిట్లు..
లావా ఇంటర్నేషనల్‌కు నోయిడాలో మొబైల్స్ తయారీ ప్లాంటు ఉంది. దీని సామర్థ్యం నెలకు 25 లక్షల యూనిట్లు. నోయిడాలో మరో ప్లాంటును కంపెనీ నెలకొల్పుతోంది. అలాగే తిరుపతి వద్ద 20 ఎకరాల్లో రూ.500 కోట్లతో ప్లాంటు రాబోతోంది. ఈ రెండు ప్లాంట్లలో 2018లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని సందీప్ తెలిపారు. మూడేళ్లలో కంపెనీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం నెలకు 50 లక్షల యూనిట్లకు చేరుతుందని చెప్పారు. దేశీయంగా లావా నెలకు 20 లక్షల మొబైల్ ఫోన్లను విక్రయిస్తోంది. 10.5 శాతం మార్కెట్ వాటాతో భారత్‌లో నాల్గవ స్థానంలో ఉంది. ఇండియన్ బ్రాండ్స్‌లో రెండో స్థానంలో ఉన్నట్టు కంపెనీ తెలిపింది.