
ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టిన ‘లింక్డ్‌ఇన్’ సోషల్ మీడియాకు భారత్‌లో ఆదరణ పెరుగుతోంది. గత 20 నెలల కాలంలో దీని యూజర్లు రెట్టింపు అయ్యారు. 2018, జనవరి నెలలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో ఆరు శాతం యూజర్లు ఉండగా, వారి సంఖ్య 2019, ఏప్రిల్ నాటికి 15 శాతానికి పెరిగినట్లు వ్యాపార విశ్లేషణ సంస్థ ‘కాలాగోట్’ తెలిపింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా 66 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, భారత దేశంలో 6.20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
భారత్‌లో ఇటీవల దీని వినియోగం భారీగా పెరగడానికి కారణం, భారత్‌లో అసాధారణంగా నిరుద్యోగ సమస్య పెరగడమే. దేశంలో మున్నెన్నడు లేనంతగా నిరుద్యోగుల శాతం 8.1 శాతం పెరిగినట్లు ఇటీవలి గణాంకాలు తెలియజేస్తున్నాయి. ‘జాబ్ ఫ్లాట్‌ఫారమ్’ ఉండడంతో భారతీయ నిరుద్యోగులందరు ‘లింక్డ్‌ఇన్’ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు మంచి ఉద్యోగావకాశాల కోసం ఈ యాప్‌ను ఆశ్రయించిన నిరుద్యోగులు ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగం కోసం ఆశ్రయిస్తున్నారని స్వతంత్ర టెక్–విధాన కన్సల్టెంట్ ప్రశాంతో కే. రాయ్‌తోపాటు పలువురు నిపుణులు తెలిపారు. అయితే ఇప్పటికీ తమకు కావాల్సిన ఉద్యోగులు ఈ యాప్ ద్వారా దొరకడం లేదని, 20 నుంచి 30 శాతం మంది ఉద్యోగులను ఇతర మార్గాల్లో వెతుక్కోవాల్సి వస్తోందని పలు కంపెనీ వర్గాలు వెల‍్లడించాయి.
ఈ యాప్‌ను పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ, బైకాన్ వ్యవస్థాపకులు కిరణ్ మజుందార్ షాలతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బాలీవుడ్ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇతర సోషల్ మీడియాలాగా వినోదం కోసం, పోటీ కోసం కాకుండా వృత్తిపరమైన అంశాలను షేర్ చేసుకోవడానికే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందుకని ఇతర సోషల్ మీడియాలతో దీనికి పోటీయే లేదు.
Comments
Please login to add a commentAdd a comment