ఆల్‌టైం కనిష్టానికి డీజిల్ నష్టాలు
లీటరుపై రూ. 1.33కి తగ్గుదల
ఇలాగే ఉంటే మరో 3 నెలల్లో డీకంట్రోల్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు డీజిల్ విక్రయాలపై వస్తున్న నష్టాలు ఆల్‌టైం కనిష్ట స్థాయికి తగ్గాయి. లీటరుకు రూ. 1.33 స్థాయికి దిగి వచ్చాయి. దీంతో, ఇదే పరిస్థితి కొనసాగితే డీజిల్ రేట్లపై నియంత్రణను మరో మూడు నెలల్లో పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు బలపడ్డాయి. శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం గత నెలలో డీజిల్ రిటైల్ విక్రయాలపై లీటరుకు రూ. 2.49 మేర ఉన్న నష్టాలు ప్రస్తుతం రూ. 1.33కి తగ్గాయి. అటు అంతర్జాతీయంగా చమురు రేట్లు క్షీణించడం, ఇటు కొత్త ప్రభుత్వం కూడా ప్రతి నెలా రేట్లను పెంచడం కొనసాగించడం ఇందుకు తోడ్పడ్డాయి.
తాజాగా గురువారం కూడా డీజిల్ రేటు అర్ధరూపాయి మేర పెరిగిన సంగతి తెలిసిందే. డీజిల్ డీకంట్రోల్‌పై గత యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత 2013 జనవరి నుంచి రేట్లు 18 సార్లు పెరిగాయి. మొత్తం మీద రేటు లీటరుకు రూ. 11.24 మేర పెరిగింది. నెలవారీ పెరుగుదల కారణంగా గతేడాది మేలో లీటరు డీజిల్‌పై నష్టాలు రూ.3 స్థాయికి తగ్గినప్పటికీ.. రూపాయి క్షీణత కారణంగా సెప్టెంబరు నాటికల్లా ఇవి రూ. 14.50 స్థాయికి పెరిగిపోయాయని అధికారులు వివరించారు.
అప్పట్నుంచి రూపాయి బలపడుతుండటంతో పాటు రేట్ల పెంపూ కొనసాగింది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలతో రూపాయి బలపడుతూ పోవడం వల్ల మార్చి నుంచి డీజిల్ విక్రయాలపై నష్టాలు వేగంగా తగ్గసాగాయి. మార్చ్‌లో రూ. 8.37గా ఉన్న నష్టాలు మేలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ. 4.41కి తగ్గాయి. జూన్ ద్వితీయార్థంలో రూ. 1.62కి క్షీణించినా.. జూలై ప్రథమార్ధంలో మళ్లీ రూ. 3.40కి పెరిగాయి. మళ్లీ గత నెల ద్వితీయార్థంలో రూ. 2.49 స్థాయికి తగ్గాయి.