నెలకు రూ.7 కరెంట్ బిల్లు!
♦ ఎల్‌ఈడీతో తక్కువ విద్యుత్ వినియోగం
♦ గదిని బట్టి రంగు మారే లైట్లు
♦ సెల్‌ఫోన్ నుంచే ఆపరేటింగ్ చేసుకునే వీలు
సాక్షి, హైదరాబాద్: బల్బు, ట్యూబ్‌లైట్లలో డే లైట్, వామ్ లైట్ అనే రెండు రంగులు మాత్రమే ఉంటాయి. అదే ఎల్‌ఈడీ లైట్లలో మనం కోరుకున్న రంగు మార్కెట్‌లో దొరుకుతుంది. అంతేకాదు ఇంట్లో గదిని బట్టి, ఆయా రోజును బట్టి కూడా లైట్ రంగును మార్చుకోవచ్చు కూడా. ఈమధ్య కాలంలో నగర వాసుల్లో ఈ విధమైన అభిరుచి బాగా పెరిగిపోయింది. పూజ గదిలో ఎరుపు, గార్డెనింగ్‌లో ఆకుపచ్చ, పడక గదిలో నీలం, హాల్‌లో వామ్ లైట్, స్టడీ రూంలో డే వైట్ లైట్, ఆఫీసుల్లో ప్యూర్ వైట్, జువెల్లరీ, బట్టల దుకాణాల్లో వామ్ లైట్, రెస్టారెంట్లు, పబ్బుల్లో నీలం, ఎరుపు, ఆరెంజ్ రంగులను ఎక్కువగా వినియోగిస్తారు.
సెల్‌ఫోన్ నుంచే ఆపరేటింగ్..
ప్రస్తుతం ఎల్‌ఈడీ లైట్లలో లైట్ ఆటోమిషన్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రకమైన ఎల్‌ఈడీ లైట్లు గదిలోకి రాగానే దానంతటదే లైట్ ఆన్ అవుతుంది. వెళ్లిపోగానే ఆఫ్ అవుతుంది. టీవీ సౌండ్ పెంచినట్టుగా రిమోట్ సహాయంతో లైట్ వెలుతురు (లుమిన్స్)ను ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు కూడా. ఇక వెబ్ బేస్డ్ సొల్యుషన్స్ ఎల్‌ఈడీ లైట్లయితే ఇంటర్నెట్ సహాయంతో ఐ-ఫోన్, ఐప్యాడ్‌ల నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా రెస్టారెంట్లు, పబ్బులు, గేమింగ్ జోన్లు, థియేటర్లు, షాపింగ్ మాళ్లులో వినియోగిస్తుంటారు.
ధర ఎక్కువైనా..
బల్బు, సీఎఫ్‌ఎల్, ట్యూబ్‌లైట్లతో పోల్చుకుంటే ఎల్‌ఈడీ లైట్ల ధర కాస్త ఎక్కువే. కానీ, విద్యుత్ వినియోగం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.
నెలకు రూ.7 కరెంట్ బిల్లు..
ఎల్‌ఈడీ లైట్లు విద్యుత్‌ను చాలా తక్కువగా తీసుకుంటాయి. రోజుకు 10 గంటల చొప్పున బల్బును నెల రోజుల పాటు వినియోగిస్తే 27 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే నెలకు రూ. 39.15 పైసలు కరెంట్ బిల్లు వస్తుంది. (డొమెస్టిక్ వినియోగంలో 0-50 యూనిట్లకు రూ. 1.45 పైసలుగా ఉంది) ట్యూబ్‌లైట్ విషయానికొస్తే.. నెలకు 21 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే రూ. 30.45 పైసలు బిల్లు వస్తుంది. అదే ఎల్‌ఈడీ లైట్‌కు అయితే నెలకు కేవలం 5 యూనిట్లే ఖర్చవుతుంది. అంటే రూ. 7.25 పైసలు మాత్రమే కరెంట్ బిల్లు వస్తుందన్నమాట.