మహీంద్రా చేతికి ‘ఫోర్డ్‌ ఇండియా’ | Mahindra And Ford Announce New Joint Venture In India | Sakshi
Sakshi News home page

మహీంద్రా చేతికి ‘ఫోర్డ్‌ ఇండియా’

Published Wed, Oct 2 2019 3:40 AM | Last Updated on Wed, Oct 2 2019 3:40 AM

Mahindra And Ford Announce New Joint Venture In India - Sakshi

న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యాపార పరంగా తీవ్ర పోటీ పరిస్థితుల నేపథ్యంలో అమెరికాకు చెందిన ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ(ఎఫ్‌ఎంసీ) మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం)తో జట్టు కట్టింది. రెండు కంపెనీల ఆధ్వర్యంలోని జాయింట్‌ వెంచర్‌(జేవీ)కు ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ భారత వ్యాపార కార్యకలాపాలు బదిలీ అవుతాయి. ఈ జేవీలో ఎంఅండ్‌ఎంకు 51 శాతం వాటా, మిగిలిన 49 శాతం వాటా ఫోర్డ్‌ మోటార్‌కు ఉంటుంది. గుజరాత్‌లోని సనంద్‌లో ఉన్న ఇంజిన్ల తయారీ ప్లాంట్‌ మాత్రం ఫోర్డ్‌ అధీనంలో ఉంటుంది. భారత్‌లో ఫోర్డ్‌ బ్రాండ్‌ కింద వాహనాల అభివృద్ధితోపాటు విక్రయాలను ఈ జేవీ చూస్తుంది. అదే విధంగా అధిక వృద్ధి అవకాశాలుఉన్న విదేశీ మార్కెట్లలో మహీంద్రా, ఫోర్డ్‌ బ్రాండ్ల వాహనాలను కూడా విక్రయిస్తుంది.

జాయింట్‌ వెంచర్‌ స్వరూపం..
ఒప్పందంలో భాగంగా ఫోర్డ్‌ మోటార్‌ అనుబంధ కంపెనీ ఆర్డోర్‌ ఆటోమోటివ్‌ ప్రైవేటు లిమిటెడ్‌లో ఎంఅండ్‌ఎం 51 శాతం వాటా తీసుకుంటుంది. ఇందుకోసం ఎంఅండ్‌ఎం రూ.657 కోట్లు చెల్లిస్తుంది. మిగిలిన 49 శాతం వాటా ఫోర్ట్‌ మోటార్‌ చేతుల్లోనే ఉంటుంది. 51 శాతం వాటా కోసం చేసే పెట్టుబడులు సహా మొత్తం రూ.1,400 కోట్లను ఆర్డోర్‌ ఆటోమోటివ్‌ పరిధిలో వ్యాపార వృద్ధికి ఎంఅండ్‌ఎం వెచ్చించనుంది. ఫోర్డ్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని భారత వ్యాపార కార్యకలాపాలు ఆర్డోర్‌ ఆటోమోటివ్‌కు బదిలీ చేస్తారు. చెన్నై, సనంద్‌ ప్లాంట్లు కూడా బదిలీ అవుతాయి. కాకపోతే సనంద్‌లోని పవర్‌ట్రెయిన్‌ తయారీ ప్లాంట్‌ను ఈ ఒప్పందంలో చేర్చలేదు. ఫోర్డ్‌ ఇండియా 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.26,324 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరాల్లో వరుసగా రూ.25,010, రూ.22,103 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది.

మూడు యుటిలిటీ వాహనాలు
మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీతోపాటు మూడు నూతన యుటిలిటీ వాహనాలను ఫోర్డ్‌ బ్రాండ్‌ కింద జాయింట్‌ వెంచర్‌ తీసుకురానుంది. అలాగే, ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఈ జేవీ దృష్టి పెడుతుంది. వర్ధమాన మార్కెట్ల కోసం వాహనాలను అభివృద్ధి చేయడంతోపాటు ఎగుమతి కూడా చేస్తుంది. ఈ రెండు సంస్థల మధ్య లావాదేవీ 2020 మధ్య నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఫోర్డ్, ఎంఅండ్‌ఎం 2017 సెప్టెంబర్‌లో వ్యూహాత్మక ఒప్పందం ఒకటి చేసుకున్నాయి.

ఉత్పత్తుల అభివృద్ధి, ఎలక్ట్రిక్‌ వాహనాలు, పంపిణీ విషయంలో సహకరించుకోవడం నాటి ఒప్పందం కాగా, ఇప్పుడు తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నాయి.
కలసి సాగితే లాభం..: ‘‘ఇంజనీరింగ్, విజయవంతమైన నిర్వహణలో మహీంద్రాకు అనుభవం ఉంది. ఫోర్డ్‌కు సాంకేతికత, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానత, భవిష్యత్తు టెక్నాలజీలను అందిపుచ్చుకునే బలాలు ఉన్నాయి’’ అని ఎంఅండ్‌ఎం చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు.  ఉమ్మడి సహకారంతో వినియోగదారులకు మరిన్ని వాహనాలను అందించడం సాధ్యపడుతుందని ఫోర్డ్‌ మోటార్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బిల్‌ఫోర్డ్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement