ముంబై: కార్లు, యుటిలిటి వాహనాలు తయారుచేసే మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అంచనాలకు మించిన ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో ఈ కంపెనీ రూ.1,411 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం, రూ.1,157 కోట్లతో పోలిస్తే 22 శాతం వృద్ధి సాధించినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.10,065 కోట్ల నుంచి 19 శాతం వృద్దితో రూ.12,018 కోట్లకు పెరిగింది.
ఇబిటా రూ.1,424 కోట్ల నుంచి 35 శాతం వృద్ధితో రూ.1,923 కోట్లకు చేరుకుందని, నిర్వహణ మార్జిన్ 14.1 శాతం నుంచి 16 శాతానికి ఎగసిందని వివరించిది. మరోవైపు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేయడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు మరో షేర్‌ను బోనస్‌గా ఇవ్వనున్నామని, ఈ బోనస్ షేర్ల జారీకి వచ్చే నెల 23వ తేదీని రికార్డ్ డేట్‌గా నిర్ణయించామని పేర్కొంది. కాగా ఇతర వ్యయాలు, సిబ్బంది వ్యయాల నియంత్రణ కారణంగా నిర్వహణ మార్జిన్‌లు పెరిగాయని నిపుణులంటున్నారు.
ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, బోనస్ షేర్ల జారీ వంటి సానుకూలాంశాల నేపథ్యంలో బీఎస్‌ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 2.3 శాతం లాభంతో రూ.1,393 వద్ద ముగిసింది. గురువారం రూ.1,361 వద్ద ముగిసిన ఈ షేర్ శుక్రవారం రూ.1,347, రూ.1,409 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి రూ.1,142గా, గరిష్ట స్థాయి రూ.1,509గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment