మహీంద్రా లాభం 584 కోట్లు
♦ 15% పెరిగిన అమ్మకాలు
♦ ఒక్కో షేర్‌కు రూ.12 డివిడెండ్
ముంబై: వాహన దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.584 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.551 కోట్లు)తో పోల్చితే 6 శాతం వృద్ధి సాధించామని మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది. నికర అమ్మకాలు రూ.9,289 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.10,666 కోట్లకు పెరిగాయని వివరించింది.
తమ పూర్తి అనుబంధ సంస్థ, మహీంద్రా వెహికల్ మాన్యుఫాక్చరర్స్‌తో కలిసి మొత్తం 69,082 వాహనాలను విక్రయించామని తెలిపింది. ట్రాక్టర్ల విక్రయాలు 41,129గా ఉన్నాయని పేర్కొంది. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.12 (240%) డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది. అలాగే డెట్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.5,000 కోట్లకు మించకుండా నిధుల సమీకరణ ప్రతిపాదనను తమ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదించిందని వివరించింది.
సానుకూలంగా గ్రామీణ అమ్మకాలు...
2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.3,137 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 2 శాతం వృద్ధితో రూ.3,211 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర అమ్మకాలు రూ.63,362 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.69,786 కోట్లకు పెరిగాయని వివరించింది. గత క్వార్టర్ నుంచే మోటార్ బైక్‌ల, ట్రాక్టర్ల అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోందనడానికి నిదర్శనమని తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ అర శాతం తగ్గి రూ.1,328 వద్ద ముగిసింది.