మహీంద్రా నుంచి పెట్రోల్ కార్లు
కంపెనీ ప్రెసిడెంట్ పవన్ గోయెంకా
కోల్‌కత: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రయాణికుల కార్ల సెగ్మెంట్లో పెట్రోల్ వేరియంట్లను అందించనున్నది. డీజిల్‌పై నియంత్రణ తొలగడం, చమురు ధరలు తగ్గుతుండడం వంటి కారణాల వల్ల డీజిల్ కార్లకు ప్రాధాన్యత తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ అన్ని డీజిల్ కార్లనే అందిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ పెట్రోల్ ఇంజిన్లతో కూడిన ప్రయాణికుల కార్లను అందించాలని యోచిస్తోంది. భవిష్యత్తులో ప్రయాణికుల కార్ల సెగ్మెంట్లో పెట్రోల్, డీజిల్ వేరియంట్లను సమానంగా అందిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్(ఆటోమొబైల్, ఫార్మ్ ఎక్విప్‌మెంట్) పవన్ గోయెంకా చెప్పారు. తాము ఇప్పటికే 1.2 లీటర్, 1.6 లీటర్, 2.2 లీటర్‌లలో పెట్రోల్ ఇంజిన్లను అభివృద్ధి చేశామని వివరించారు. అయితే ఫుల్ సైజ్ ఎస్‌యూవీ వాహనాలను మాత్రం డీజిల్ వేరియంట్లలోనే అందిస్తామని పేర్కొన్నారు.
స్పోర్ట్స్‌యుటిలిటి వెహికల్స్(ఎస్‌యూవీ), యుటిలిటి వెహికల్స్(యూవీ)లకే ప్రాధాన్యత ఇస్తామని, ప్రయాణికుల వాహనాలకు కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు డీజిల్ వేరియంట్‌లోనే అందిస్తున్న తమ ఏకైక ప్రయాణికుల కారు వెరిటోను త్వరలో ఎలక్ట్రిక్ వేరియంట్‌లో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. దీంతో పాటు తేలిక రకం వాణిజ్య వాహనం (ఎల్‌సీవీ), మాక్సిమోను కూడా ఎలక్ట్రిక్ మోడల్‌లో అందిస్తామని వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలను నార్వే, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి పశ్చిమ యూరప్ దేశాలకు ఎగుమతి చేయాలని యోచిస్తున్నామని గోయెంకా తెలిపారు. తమ ఎలక్ట్రిక్ వాహనాలు ఆశించిన అమ్మకాలు సాధించడం లేదని అంగీకరించారు. ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లకు రాష్ట్రప్రభుత్వాలు తగిన తోడ్పాటునివ్వడం లేదని చెప్పారు.