అవగాహనతో పెట్టుబడి పెడితే
స్టాక్ మార్కెట్లో అధిక రాబడులు
కరీంనగర్: స్టాక్ మార్కెట్లో అవగాహనతో పెట్టుబడి పెడితే ఇతర సాధనాల్లో పెట్టుబడులకంటే అధిక రాబడులు సంపాదించవచ్చని పలువురు నిపుణులు సూచించారు. సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్‌లోని కిమ్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సుకు భారీ స్పందన లభించింది. పెట్టుబడి అవకాశాలు, స్టాక్ మార్కెట్‌ల్లోకి ప్రవేశించడం ఎలా?, భవిష్యత్ అవసరాల కోసం అనువైన పెట్టుబడులు ఎలా పెట్టాలి...పథకాల ఎంపికలో జాగ్రత్తలు తదితర విషయాలపై ఆర్థిక రంగ నిపుణులు సలహాలు ఇచ్చారు.
సదస్సుకు సీడీఎస్‌ఎల్ రీజినల్ మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి, కొటక్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ జి.తిరుమల్‌రెడ్డి, కార్వే స్టాక్ బ్రోకింగ్ జోనల్ హెడ్ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ అరవింద్ వింజమూరి స్టాక్ మార్కెట్లో అవగాహనతో మదుపు చేస్తే ఇతర పెట్టుబడి పథకాల కంటే రిటర్న్స్ అధికంగా ఎలా వస్తాయో వివరించారు. ఏయే కంపెనీలలో పొదుపు చేయాలి, ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడుల నిర్వహణ, డీమ్యాట్ సమాచారం, మ్యూచువల్ ఫండ్స్ ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. షేర్ మార్కెట్‌లలో కలిగే మార్పులు, లాభనష్టాలు, మ్యూచువల్ ఫండ్స్‌లో లాంగ్‌టర్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తే కలిగే ప్రయోజనాలు వివరించారు. సదస్సులో వ్యాపార, వర్తక యజమానులు, ఎంబీఏ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.