అవగాహనతో మదుపు చేస్తే అధిక రాబడి..
సాక్షి మదుపరుల అవగాహన సదస్సులో సీడీఎస్‌ఎల్ ఆర్‌ఎం శివప్రసాద్
సాక్షి,హైదరాబాద్: స్టాక్ మార్కెట్‌లో అవగాహనతో మదుపు చేస్తే ఇతర పెట్టుబడి పథకాల కన్నా అధికంగానే రాబడి ఉంటుందని సీడీఎస్‌ఎల్ రీజనల్ మేనేజర్ శివప్రసాద్ అన్నారు. సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్, సీడీఎస్‌ఎల్, కొటక్ మ్యూచువల్ ఫండ్స్, యాక్సిస్ బ్యాంక్ సంస్థలు సంయుక్తంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న వయసు నుండే పెట్టుబడులు ప్రారంభించి, దీర్ఘకాలం కొనసాగిస్తే ఆర్థికంగా మంచి ఫలితాలు చూడవచ్చన్నారు. రానున్న రోజుల్లో మార్కెట్ మరింత వృద్ధి చెందేందుకు అవకాశం ఉన్నందున ఆలస్యం చేయకుండా ఈక్విటీల్లో మదుపు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
అయితే దేశ జనాభా 121 కోట్లు ఉన్న మన దేశంలో డీ మ్యాట్ ఖాతాల సంఖ్య 2.50 కోట్లు మాత్రమే ఉన్నాయని, స్టాక్స్‌లో మదుపునకు ముందుగా ఉండాల్సింది డీమ్యాట్ ఖాతానేనని తెలిపారు. పాన్‌కార్డు ఉన్న వ్యక్తులెవరైనా డీ మ్యాట్ ఖాతాను ప్రారంభించేందుకు వీలుందని, ఇందులో ఎలక్ట్రానిక్ రూపంలో షేర్లను భద్రపర్చుకోవచ్చని వివరించారు. డీ మ్యాట్ ఖాతాదారులు తప్పనిసరిగా నామినీని పేర్కొనా లని, అనుకోనిదేదైనా జరిగితే ఖాతాలో ఉన్న షేర్లను నామినీ ఖాతాలోకి వెంటనే బదిలీ చేయవచ్చన్నారు.
అనంతరం కోటక్ మ్యూచువల్ ఫండ్ ఏపీ, తెలంగాణ హెడ్ టి.విజయకుమార్, యాక్సిస్ బ్యాంక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్ మెండే మదుపు ప్రయోజనాలను వివరించారు. సాక్షి బిజినెస్ ఎడిటర్ రమణమూర్తి మాట్లాడుతూ... చాలా మందికి పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు కానీ ఎక్కడా మదుపు చేస్తే ఎక్కువ డబ్బులు ఆర్జించవచ్చనే విషయంలో క్లారిటీ ఉండదని, అటువంటి వారికి మార్గనిర్దేశనం చేసేందుకు సాక్షి ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ సదస్సులో అధిక సంఖ్యలో పాల్గొన్న మదుపరులు తమ సందేహాలు నిపుణులను అడిగి తెలుసుకున్నారు.