అవగాహనతోనే మార్కెట్లో మదుపు..
సాక్షి, విజయవాడ : స్టాక్‌మార్కెట్‌లో అవగాహనతో మదుపు చేస్తే ఇతర పెట్టుబడి పథకాల కంటే అధికంగా లాభాలు ఉంటాయని సీడీఎస్‌ఎల్ రీజనల్ మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి అన్నారు. స్టాక్‌మార్కెట్లోకి ఎలా ప్రవేశించాలి, పెట్టుబడులు ఎలా పెట్టాలి, ఏ కంపెనీల్లో మదుపు చేయాలి, ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడుల నిర్వాహణ, డీమ్యాట్ సమాచారం, మ్యూచువల్ ఫండ్స్‌తో ప్రయోజనాలను ఔత్సాహిక మదుపరులకు వివరించారు. ఆదివారం విజయవాడలో సాక్షి మైత్రీ ఇన్వెస్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది.
ముఖ్యాంశాలు:
* దేశ జనాభా 121 కోట్లు దాటిందని, బ్యాంకు ఖాతాలు 46 కోట్లుండగా సెల్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 100 కోట్లు పైగా ఉందని, కానీ డీమ్యాట్ ఎకౌంట్‌లు మాత్రం 2.35 కోట్లే ఉన్నాయని తెలిపారు. స్టాక్‌మార్కెట్లో మదుపు చేయాలనుకునే వారికి ఉండాల్సింది ముందుగా డీమ్యాట్ ఖాతానే అని, పాన్‌కార్డు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఖాతాను ప్రారంభించేందుకు అవకాశం ఉందని అన్నారు. ఇందులో ఎలక్ట్రానిక్ రూపంలో షేర్లను భద్ర పరచుకోవచ్చని తెలిపారు.
* రూ.500 లతో షేర్‌మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చని, మదుపరులు తమ వయస్సు, నష్టాన్ని భరించే సామర్థ్యం ఆధారంగా పథకాలు ఎంచుకోవచ్చన్నారు. నష్టాల రిస్క్ ఎక్కువగా ఉన్నచోట రాబడి అధికంగా ఉంటుందని తెలిపారు.
* చాలా మంది 25-60 ఏళ్ల మధ్యనే సంపాదిస్తారని, 60 ఏళ్ల తర్వాత ప్రశాంతమైన జీవనం గడపాలంటే పెట్టుబడులను సవ్యమైన రీతిలో పెట్టడం, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో మదుపు ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా చూసుకోవాలన్నారు.
కార్యక్రమంలో కోటక్ మ్యూచువల్ ఫండ్స్ ఏరియా హెడ్ ప్రసన్న ఉదరగూడి, కార్వీ స్టాక్‌బ్రోకింగ్ ఆపరేషన్స్ హెడ్ సుదెందు గాంధీ, రీసెర్చ్ ఎనలిస్ట్ అరవింద్ వింజమూరి, సాక్షి అడ్వటైజింగ్ మేనేజర్ జేఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.