సాక్షి, న్యూఢిల్లీ: దేశీ, విదేశీ విమానాల్లో వేధింపులు పరిపాటిగా మారిపోయాయి. ఇటీవల భాలీవుడ్ నటి జైరాను లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపగా.. తాజాగా ఎయిర్ విస్తారా మహిళా ఉద్యోగిపట్ల ఓ ప్యాసెంజర్ అనుచితంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. లక్నో-ఢిల్లీ విస్తారా విమానంలో మార్చి 24వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది.
లక్నోనుంచి ‘యూకే 997’ విమానం ఢిల్లీలో అడుగుపెట్టినపుడు క్యాబిన్ క్రూ ఉద్యోగి పట్ల ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో వైమానిక సిబ్బంది ఎయిర్ పోర్ట్‌లోని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడు రాజీవ్ వసంత్ డానీ (62)గా గుర్తించారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని విస్తారా ధృవీకరించింది. సిబ్బందిపై ప్రయాణీకుల అనుచిత ప్రవర‍్తన, వేధింపులను సహించేది లేదని, ఈ వైఖరి ఇతర ప్రయాణీకులకు కూడా ఇబ్బందిగా మారుతుందని , దీనిపై కఠినచర్యలు తీసుకుంటామని ఎయిర్‌లైన్స్ ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది.
కాగా గత ఏడాది దంగల్ నటి జైరా వాసిం తనకు జరిగిన అవమానంపై కంటతడి పెడుతూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టడం అప్పట్లో సంచలనం రేపింది. దీనిపై స్పందించిన విస్తారా ఎయిర్‌లైన్స్ జైరాకు క్షమాపణలు చెప్పింది. ఈ కేసులో ముంబైకి చెందిన వ్యాపారవేత్త వికాస్ సచ్‌దేవ్ లైంగిక వేధింపు ఆరోపణలతో ఐపిసి సెక్షన్ 354 కింద బుక్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment