ముంబై : ఈక్విటీ బెంచ్‌మార్కు సూచీలు వరుసగా మూడో రోజు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిల్లో ముగిశాయి. సెన్సెక్స్ 57.73 పాయింట్ల లాభంలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయి 31,804.82 వద్ద ముగియగా.. నిఫ్టీ 30.05 పాయింట్ల లాభంలో మొట్టమొదటిసారి 9,800కి పైన 9809.60 వద్ద క్లోజైంది. నేటి మార్కెట్లో బయోకాన్ షేర్లు 14 శాతం మేర లాభాల వర్షం కురిపించాయి. ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీలు కూడా 1-2 శాతం లాభాలు పండించాయి.
అయితే జూన్ క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేర్లు 1 శాతం డౌన్ అవ్వగా.. ఎం అండ్ ఎం కూడా నష్టాలు గడించింది. జియో కొత్త టారిఫ్ ప్లాన్లను ప్రకటించిన అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఇంట్రాడేలో 2 శాతం మేర ర్యాలీ జరిపి, మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. 2008 జనవరి 17 తర్వాత అత్యంత గరిష్టస్థాయి రూ.1,524.50ను తాకింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 64.55గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పలాభాలను నమోదుచేశాయి. 44 రూపాయల లాభంలో 27,870గా ముగిశాయి.