ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మధ్యలో అమ్మకాల ఒత్తిడితో దెబ్బతిన్నాయి. తిరిగి మిడ్‌సెషన్ నుంచీ ఊపందుకుని చివరికి చెప్పుకోదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు పెరిగి 33,605 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం లాభాల సెంచరీ చేసి 9,914 వద్ద స్థిరపడింది. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కార్పొరేట్ బాండ్ల కొనుగోలు ద్వారా కంపెనీలకు మరింత ఆర్థిక చేయూత నిచ్చేందుకు నిర్ణయించడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు జోష్ వచ్చింది. దీంతో ఆసియా మార్కెట్లు 4-1 శాతం మధ్య జంప్ చేశాయి. ఈ బాటలో తొలుత సెన్సెక్స్ 800 పాయింట్ల వరకూ ఎగసింది. 34,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 34,022ను తాకింది. తదుపరి అమ్మకాల ఒత్తిడిలోపడి 33,000 పాయింట్ల దిగువన 32,953కు జారింది. ఇది 250 పాయింట్ల నష్టంకాగా.. ఇంట్రాడేలో 1,000 పాయింట్ల పరిధిలో ఊగిసలాడింది. ఈ బాటలో నిఫ్టీ తొలుత 10,046 వద్ద గరిష్టాన్ని తాకగా.. మిడ్‌సెషన్‌లో 9729 దిగువన కనిష్టాన్ని చవిచూసింది.
ప్రయివేట్ బ్యాంక్స్ అప్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, మీడియా 2-1.25 శాతం మధ్య పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, యూపీఎల్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా, హీరో మోటో, వేదాంతా 4-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే టాటా మోటార్స్ 6 శాతం పతనంకాగా.. ఇన్‌ఫ్రాటెల్, ఇండస్‌ఇండ్, టెక్ మహీంద్రా, యాక్సిస్, గెయిల్, ఐవోసీ, ఐటీసీ, ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్ 3-1 శాతం మధ్య క్షీణించాయి.
బాలకృష్ణ జోరు
డెరివేటివ్స్‌లో బాలకృష్ణ, ఎల్‌ఐసీ హౌసింగ్, జిందాల్ స్టీల్, గోద్రెజ్ సీపీ, ఎస్‌బీఐ లైఫ్, అమరరాజా 5.2-3.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఐడియా, టాటా పవర్, శ్రీరామ్ ట్రాన్స్, అపోలో హాస్పిటల్స్, బీవోబీ, కేడిలా హెల్త్‌కేర్, ఎన్‌సీసీ 4.4-2.7 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్ 0.4 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1380 లాభపడగా.. 1193 నష్టపోయాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2960 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1076 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. ఇక శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1311 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 1945 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment