న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ తన కొత్త స్విఫ్ట్, బాలెనో మోడల్స్‌ను రీకాల్ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. 52686 యూనిట్ల కొత్త స్విఫ్ట్, బాలెనో మోడల్స్‌ను రీకాల్ చేయనున్నామని, అనంతరం వాటిని పరీక్షించి, లోపం ఉన్న బ్రేక్ వాక్యుమ్‌ను రీప్లేస్ చేయనున్నట్టు మారుతీ సుజుకీ పేర్కొంది. 2017 డిసెంబర్ 1 నుంచి 2018 మార్చి 16కు మధ్యలో తయారుచేసిన స్విఫ్ట్, బాలెనో వాహనాలకు ఈ సర్వీసు క్యాంపెయిన్ చేపట్టనున్నట్టు తెలిపింది.
ఈ సర్వీసు క్యాంపెయిన్‌లో భాగంగా 2018 మే 14 నుంచి వాహన యజమానులు డీలర్లను సంప్రదించాలని, లోపం ఉన్న భాగాన్ని రీప్లేస్‌మెంట్ చేసుకోవాలని కంపెనీ సూచించింది. గ్లోబల్‌గా కూడా ఆటోమొబైల్ కంపెనీలు పెద్ద మొత్తంలో సర్వీసు క్యాంపెయిన్లను చేపడుతున్నాయి. కస్టమర్లకు అసౌకర్యం కలిగిస్తున్న లోపం ఉన్న భాగాలను సరిదిద్దుతున్నాయి. సర్వీసు క్యాంపెయిన్‌లో భాగంగా మారుతీ చేపడుతున్న ఈ తనిఖీ, రీప్లేస్‌మెంట్ కస్టమర్లకు ఉచితం.
మీ స్విఫ్ట్ లేదా బాలెనో కారు రీకాల్‌లో భాగమై ఉందో లేదో తెలుసుకోవడం కోసం కస్టమర్లకు మారుతీ సుజుకీ అధికారిక సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ వాహన ఛాసిస్ నెంబర్‌ను నమోదుచేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేసిన తర్వాత ఒకవేళ మీ కారు ఆ రీకాల్ జాబితాలో ఉంటే, కస్టమర్లు కంపెనీ సర్వీసు స్టేషన్‌ను సందర్శించి, పరీక్షించుకుని, లోపం ఉన్న భాగాన్ని రీప్లేస్ చేయించుకోవాలి. ఛాసిస్ నెంబర్ వాహన ఇన్‌వాయిస్‌లో, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఉంటుంది. కాగా, సియామ్ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన డేటాలో 2018 తొలి మూడు నెలల కాలంలో 1.12 లక్షలకు పైగా వాహనాలను ఆటోమొబైల్ కంపెనీలు రీకాల్ చేసినట్టు తెలిసింది. ఈ మొత్తం 2017లో రీకాల్ చేసిన వాహనాల కంటే కూడా ఎక్కువే.
Comments
Please login to add a commentAdd a comment