అమెరికాలో భారత్ ఫండ్ మేనేజర్‌కు 9 ఏళ్ల జైలు
న్యూయార్క్: ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో భారతీయ సంతతికి చెందిన ఫోర్ట్‌పోలియో(ఫండ్) మేనేజర్ మాథ్యూ మార్టోమా(40 ఏళ్లు)కు 9 ఏళ్ల జైలు శిక్ష పడింది. 27.6 కోట్ల డాలర్లకుపైగా మొత్తంతో ముడిపడిఉన్న ఈ ఇన్‌సైడర్ ట్రేడింగ్ స్కీమ్‌లలో మార్టోమాను కీలక సూత్రధారిగా పేర్కొంటూ న్యూయార్క్ ఫెడరల్ కోర్టు డిస్ట్రిక్ట్ జడ్జి పాల్ గార్డఫే తీర్పు ఇచ్చారు. ఈ కేసులో మథ్యూ అక్రమంగా ఆర్జించిన 98 లక్షల డాలర్ల బోనస్ మొత్తాన్ని జప్తు చేయాలని ఆదేశించారు. ఫ్లోరిడాలో ఆయనకున్న ఇంటితోపాటు, పలు బ్యాంక్ అకౌంట్లను కూడా స్వాధీనం చేసుకోవాలని తేల్చిచెప్పారు.
అల్జీమర్స్ ఔషధానికి సంబంధించిన పరీక్షల(ట్రయల్స్) రహస్య సమాచారాన్ని ఇద్దరు డాక్టర్ల నుంచి అక్రమంగా సేకరించి.. ఎస్‌ఏసీ క్యాపిటల్ 27.5 కోట్ల డాలర్ల మేర నష్టపోకుండా చూడటంతోపాటు లాభాలను కూడా ఆర్జించిపెట్టాడన్నది కేసు ప్రధానాంశం. కాగా, ఈ కేసులో ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా మార్టోమాకు వ్యతిరేకంగా వాదించింది కూడా భారతీయ సంతతికి చెందిన ప్రీత్ భరారాయే. గతంలోనూ ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసుల్లో గోల్డ్‌మన్ శాక్స్ మాజీ డెరైక్టర్ రజన్ గుప్తా, హెడ్జ్ ఫండ్ దిగ్గజం రాజ్ రజరత్నంలకు శిక్ష పడేలా చేసింది భరారా కావడం గమనార్హం. తాజా కేసుతో ఇప్పటిదాకా వాల్‌స్ట్రీట్‌లో 78 ఇన్‌సైడర్ నేరాల్లో శిక్షలు వేయించిన చెక్కుచెదరని రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు కూడా.