
తెలంగాణలో రెడీ అవుతున్న ఫౌండ్రీ పార్కు
50 కంపెనీలు.. రూ. 300 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగర్ ఫౌండ్రీస్ అసోసియేషన్ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ఫౌండ్రీ పార్కు ఈ ఏడాదే కార్యరూపంలోకి రానుంది. మెదక్ జిల్లా శివంపేట మండలం నవాబ్‌పేట్ వద్ద 170 ఎకరాల్లో ఇది ఏర్పాటవుతోంది. స్థలాన్ని బదలాయించే పనులను తెలంగాణ ప్రభుత్వం వేగిరం చేసింది. ఏప్రిల్-మే నాటికి టీపీఐఐసీ చేతికి స్థలం వచ్చే అవకాశం ఉంది. టీపీఐఐసీ ఈ స్థలాన్ని అభివృద్ధి చేసి ప్రాజెక్టు అమలు కోసం ఏర్పాటయ్యే స్పెషల్ పర్పస్ వెహికల్‌కు (ఎస్‌పీవీ) అప్పగిస్తుంది.
స్థలం అభివృద్ధి వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం, కేంద్రం 50 శాతం భరిస్తుందని అసోసియేషన్ వెల్లడించింది. పెట్టుబడులకు కంపెనీలు సిద్ధంగా ఉండడంతో పార్కును త్వరితగతిన తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
పరిశ్రమకు కొత్త ఊపు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 500 ఫౌండ్రీ యూనిట్లు ఉన్నాయి. ఏటా రూ.5,000 కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. ప్రత్యక్షంగా ఒక లక్ష, పరోక్షంగా 3 లక్షల మంది పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇక సగం యూనిట్లు తెలంగాణలో ఉన్నాయి. వ్యాపారం సుమారు రూ.3 వేల కోట్లకుపైమాటే. వాహన, మౌలిక రంగం, విద్యుత్(ముఖ్యంగా సోలార్), నిర్మాణ పరిశ్రమల నుంచి క్యాస్టింగ్స్‌కు డిమాండ్ పెరిగింది. ఫౌండ్రీ పరిశ్రమ 2015లో 10 శాతం, 2016లో 15 శాతం వృద్ధి ఖాయమని అసోసియేషన్ కార్యదర్శి ఎం.ప్రభాకర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు.
‘పిగ్ ఐరన్ ధర గతేడాదితో పోలిస్తే రూ.7 వేలు తగ్గి ప్రస్తుతం రూ.28 వేలుంది. దీనికితోడు తెలంగాణలో విద్యుత్ కోతల్లేవు. చార్జీలు తక్కువ. తయారీ వ్యయమూ తక్కువే. అందుకే చెన్నైలోని వాహన కంపెనీలు తెలంగాణ నుంచే అత్యధికంగా క్యాస్టింగ్స్‌ను కొనుగోలు చేస్తున్నాయి’ అని వెల్లడించారు. పార్కులో ఒకేచోట అన్ని రకాల క్యాస్టింగ్స్ లభిస్తాయి కాబట్టి అటు వాహన, యంత్రాల తయారీ కంపెనీలు విడిభాగాలను ఈ ప్రాంతం నుంచే కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతాయన్నారు.
డిసెంబర్‌లోగా కార్యకలాపాలు..
పార్కులో 50 కంపెనీలు సుమారు రూ.300 కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. ప్రత్యక్షంగా 10 వేలు, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తుంది. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాదే పార్కులో ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రభాకర్ వెల్లడించారు. కంపెనీలకు అన్ని రకాల ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పార్కులో ఉన్న యూనిట్ల కోసం 20 మెగావాట్ల బయో లేదా సోలార్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎస్పీవీ కూడా పెట్టుబడి పెడుతుందని చెప్పారు. అత్యాధునిక శిక్షణ కేంద్రం, ఆర్‌అండ్‌డీ సెంటర్, కామన్ టెస్టింగ్ ఫెసిలిటీ, గోడౌన్లు పార్కులో ఏర్పాటు అవుతాయని ఆయన వివరించారు.