
మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) ఆశాజనక వృద్ధిరేటును నమోదుచేసింది. జూలై– సెప్టెంబర్ త్రైమాసికంలో 14 శాతం వృద్ధి చెంది రూ.24 లక్షల కోట్లకు చేరినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) నివేదిక ద్వారా వెల్లడైంది. క్రితం ఏడాది ఇదేకాలంలో దేశీ ఎంఎఫ్‌ల ఏయూఎం రూ.21 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ అంశంపై స్పందించిన ఎంఎఫ్ పరిశ్రమ వర్గాలు.. రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం గణనీయంగా పెరగడం వల్లనే ఈ సారి రెండంకెల వృద్ధిరేటు సాధ్యపడిందని పేర్కొన్నాయి.
తమ పరిశ్రమ కొనసాగించిన అవగాహన ప్రచారం కారణంగా క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికల (సిప్) ద్వారా పెట్టుబడులు జోరందుకున్నట్లు వివరించాయి. పరిశ్రమలోని 41 సంస్థలలో 33 ఎంఎఫ్‌లు వృద్ధిరేటును నమోదుచేశాయి. తాజా నివేదిక ప్రకారం సెప్టెంబరు నాటికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏయూఎం (ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను మినహాయించి) రూ.3,10,257 కోట్లు కాగా, ఆ తరువాత స్థానంలో ఉన్నటువంటి హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్ ఏయూఎం రూ.3,06,360 కోట్లుగా నమోదైంది. రూ.2,54,207 కోట్లతో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మూడవ స్థానంలోనూ, ఎస్‌బీఐ ఎంఎఫ్ రూ.2,53,829 కోట్లతో నాలుగవ స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment