
మైక్రోసాఫ్ట్ మరిన్ని చౌక స్మార్ట్‌ఫోన్‌లు
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ మరిన్ని మాస్(చౌక) స్మార్ట్‌ఫోన్‌లను అందించనున్నది. విండోస్ ఓఎస్‌పై పనిచేఏ 100-200 డాలర్ల(రూ.6,000-12,000) ఖరీదుండే హ్యాండ్‌సెట్‌లను త్వరలో మార్కెట్లోకి తేనున్నది. మొబైల్ ఫోన్ మార్కెట్లో చెప్పుకోదగ్గ స్థాయి మార్కెట్ వాటా కొల్లగొట్టడం తమ లక్ష్యమని మైక్రోసాఫ్ట్ ఇండియా కంట్రీ జనరల్ మేనేజర్(కన్సూమర్ చానల్స్ గ్రూప్) చక్రపాణి గొల్లపలి చెప్పారు. సీఐఐ ఇక్కడ నిర్వహించిన మూడో వార్షిక మొబైల్ సమావేశం 2014లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం భారత్‌లో విండోస్ ఆధారిత ఫోన్‌లు రెండో స్థానంలో ఉన్నాయని వివరించారు. యాపిల్, బ్లాక్‌బెర్రీలను తోసిరాజని ఈ స్థానాన్ని సాధించామని పేర్కొన్నారు. తమ మార్కెట్ వాటా 1.5% నుంచి 5%కి పెరిగిందని వివరించారు. ఆండ్రాయిడ్ తర్వాతి స్థానం తమదేనని చెప్పారు.
మరిన్ని యాప్‌లు...
3-4 నెలల్లో 100-200 డాలర్ల ఖరీదుండే మాస్ స్మార్ట్‌ఫోన్‌లు అందించనున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న నోకియా లూమియా ఇదే రేంజ్‌లో ఉన్న ఫోన్ అని వివరించారు. ఇక వినియోగదారులను ఆకర్షించడానికి సినిమా, ఆటలు, సంగీతం, మ్యాప్‌లు, తదితర సంబంధిత యాప్‌లను, కంటెంట్‌ను కూడా అందించాలని యోచిస్తున్నామని చక్రపాణి వివరించారు. లెసైన్స్ ఫీజును కూడా తగ్గించామని పేర్కొన్నారు. ఇక మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ట్యాబ్లెట్‌లను మరిన్ని భారత మార్కెట్లోకి విడుదల చేస్తామని వివరించారు.