సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఓ అరుదైన మైలురాయికి చేరువవుతోంది. ఈ సంస్థ త్వరలోనే మార్కెట్ విలువ పరంగా ఒక ట్రిలియన్ డాలర్ల(సుమారు రూ.65 లక్షల కోట్లు) కంపెనీగా అవతరించబోతున్నట్టు ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ షేర్లు కూడా సోమవారం ఏడు శాతానికి పైగా పెరిగాయని టెక్నాలజీ వెబ్‌సైట్ గీక్‌వైర్ రిపోర్టు చేసింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 722 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 47లక్షల కోట్లు)గా ఉంది. ఏడాది కాలంలోనే ఈ విలువ ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయని మోర్గాన్ స్టాన్లీ భావిస్తోంది.
అయితే ఆపిల్, ఆల్ఫాబెట్, అమెజాన్ కంపెనీల్లో ఒకటి తొలి ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించబోతుందని పలువురు టెక్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోర్గాన్ స్టాన్లీ అంచనాలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఆపిల్ మార్కెట్ విలువ 876 బిలియన్ డాలర్లు కాగ, అమెజాన్ 753 బిలియన్ డాలర్లుగా, ఆల్ఫాబెట్ 731 బిలియన్ డాలర్లుగా ఉంది. క్లౌడ్ టెక్నాలజీ, మెరుగైన కస్టమర్ బేస్, మార్జిన్స్, అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ వంటివి మైక్రోసాఫ్ట్ మార్కెట్ పెరగడానికి దోహదపడతాయని మోర్గాన్ స్టాన్లీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment