
డిపాజిట్ పసిడి ఈ-ఆక్షన్ కు రంగం సిద్ధం!
న్యూఢిల్లీ: డిపాజిట్ పథకం కింద ప్రభుత్వ సమీకరించిన పసిడిని ఈ-ఆక్షన్ ద్వారా విక్రయించడానికి రంగం సిద్ధమయ్యింది. ప్రభుత్వ రంగ ట్రేడింగ్ సంస్థ- ఎంఎంటీసీ కనీసం ఐదు కేజీల కడ్డీల చొప్పున లాట్స్‌గా వీటిని విక్రయించనున్నట్లు సమాచారం. 2015-16 బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం గత ఏడాది నవంబర్ 5వ తేదీన ప్రారంభమైంది. ఇప్పటివరకూ 105 డిపాజిటర్ల నుంచి 2.8 టన్నుల పసిడి ఈ పథకం కింద డిపాజిట్ అయ్యిందని మేలో ఆర్థికమంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది.
ఇటీవల సమావేశం అయిన వాణిజ్య, ఆర్థిక శాఖ అధికారులు పసిడి ఆక్షన్ విషయమై చర్చించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. గృహాలు, వివిధ సంస్థలు, దేవాలయాల వద్ద ఉపయోగించకుండా ఉన్న పసిడిని సమీకరించడం, దేశంలో విక్రయిం చడం, దేశీయం గా తగిన సరఫరాల ద్వారా దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. భారత్ ప్రతి యేడాదీ దాదాపు వెయ్యి టన్నుల పసిడి దిగుమతులకుగాను భారీ విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది.