మొబైల్‌తోనే బీమా క్లెయిమ్! | mobile apps insurance companies | Sakshi
Sakshi News home page

మొబైల్‌తోనే బీమా క్లెయిమ్!

Published Sun, Jan 25 2015 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

మొబైల్‌తోనే బీమా క్లెయిమ్!

మొబైల్‌తోనే బీమా క్లెయిమ్!

ఫాస్ట్ ఫార్వర్డ్ యుగమిది. ఇంట్లో డ్రెస్ నుంచి రోడ్డు మీది రెస్టారెంట్ వరకు.. దేన్నీ వెతుక్కోవటం ఈ తరానికి అస్సలు నచ్చటం లేదు. శోధించి సాధించడం కాదు.. సిద్ధంగా ఉంటే సంతోషిస్తారంతే!! అందుకే రెస్టారెంట్లను వెదికిపెట్టడం దగ్గర్నుంచి ప్రతిదానికీ మొబైల్ యాప్‌లు తయారవుతున్నాయి. ఇపుడీ యాప్‌లు బీమా కంపెనీలకూ పాకాయి. ప్రీమియం చెల్లింపుల నుంచి క్షణాల్లో పాలసీ క్లెయిమ్ చేయటం వరకూ అన్నిటినీ మొబైల్ నుంచే చేయడానికి వీలు కల్పిస్తున్నాయివి.
 
ఒక్క క్లిక్‌తోనే క్లెయిమ్ చేసేందుకు వీలు
యాప్స్‌ను అందుబాటులోకి తెస్తున్న బీమా సంస్థలు
సమగ్ర సమాచారంతోపాటు పాలసీ చెల్లింపులు

సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం: ప్రస్తుతం దాదాపు ప్రతి బీమా కంపెనీ తన సొంత మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. యాప్ వినియోగంతో బీమా చెల్లింపుల్లో చాలా మార్పులు వచ్చినట్లు ఇటీవల బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నిర్వహించిన సర్వేలో సైతం తేలింది. ‘‘యాప్స్ వినియోగం వల్ల బీమా సంస్థల విషయంలో కస్టమర్ల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో రెండేళ్ల కిందటిదాకా ఆన్‌లైన్లో పాలసీ చెల్లింపులు 5 శాతంగా ఉంటే.. యాప్స్‌ను వినియోగించటం మొదలుపెట్టాక ఇవి 15 శాతానికి పెరిగాయి’’అని బీసీజీ సర్వే తెలియజేసింది.
 
బీమా అంతా యాప్స్‌లోనే..
పాలసీ తీసుకోవటం చాలామందికి ఓకే. కానీ నెలనెలా చెల్లించాలంటే కష్టమే. తేదీలు గుర్తుపెట్టుకోవటం, కంపెనీలకు వెళ్లటం, అక్కడ చెల్లించటం ఇవన్నీ కాస్త ఇబ్బందితో కూడుకున్నవే. అలాంటి అవసరమేదీ లేకుండా నేరుగా యాప్ ద్వారానే చెల్లించడాన్ని కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. అంతేకాక ఎప్పుడు చెల్లించాలో... పాలసీ ఎప్పుడు పూర్తవుతుందో... ఒకవేళ ఏవైనా క్లెయిమ్‌లు చేసుకోవాల్సి ఉన్న పక్షంలో... సదరు పాలసీకి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆ వినియోగదారులకు ఎప్పటికప్పుడు మొబైల్‌కే చేరవేస్తున్నాయి.

కొత్త పాలసీలు ఏవి అందుబాటులోకి వచ్చినా ఆ వివరాలు కూడా యాప్స్‌లో సిద్ధం చేస్తున్నాయి. ఒకరకంగా బీమా యాప్‌ను వినియోగించే వారు తమ చెల్లింపు తేదీలను, రెన్యువల్ తేదీలను మిస్ అయ్యే అవకాశం ఉండదన్న మాట. వీటితో పాటు ఫండ్ విలువలు, బ్రాంచ్‌లు, నెట్‌వర్క్ ఆసుపత్రులు, గ్యారేజీ స్టేషన్లు ఇలా బీమా సంస్థలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని యాప్‌లోనే చెబుతున్నాయ్.
 
మ్యూనికేషన్ గ్యాప్స్ ఉండవు...
యాప్స్ వినియోగంతో అటు బీమా సంస్థలు, ఇటు పాలసీదారులు ఇద్దరూ ఎల్లవేళలా సత్సంబంధాలు కొనసాగించొచ్చు. ప్రీమియం, పాలసీల విషయంలో పాలసీదారులకు తలెత్తే సవాలక్ష ప్రశ్నలను క్షణాల్లో నివృత్తి చేయడంలో అటు బీమా సంస్థలకు, ఎలాంటి జాప్యాల్లేకుండా వేగంగా పాలసీని క్లెయిమ్ చేసుకోవటంలో ఇటు పాలసీదారులకూ ఇద్దరికీ ఈ యాప్స్ అక్కరకొస్తున్నాయి.
 
క్క క్లిక్‌తో క్లెయిమ్..
బీమా చేయటమే కాదు వాటిని క్లెయిమ్ చేసేటపుడే అసలైన సమస్యలు ఎదురవుతాయి. అయితే యాప్స్ వినియోగంతో ఈ చిక్కులేవీ ఉండవంటున్నాయి బీమా సంస్థలు. పాలసీ వివరాలు ముందుగానే యాప్‌లో నిక్షిప్తమై ఉంటాయి కనక.. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే పాలసీ గురించి, కస్టమర్ సర్వీస్ నంబర్ గురించి మనం అదే పనిగా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక్క క్లిక్‌తో క్లెయిమ్ తాలూకా వివరాలు క్షణాల్లో సంబంధిత బీమా సంస్థకు చేరుతాయి.

సంఘటన జరిగినప్పుడే కాదండోయ్.. ఎప్పుడైనా.. ఎక్కడైనా క్లెయిమ్ తాలూకు వివరాలను మనం తెలుసుకునే వీలుంటుంది. అలాగే అత్యవసర సమయాల్లో బీమా సంస్థలకు సంబంధించిన ఆసుపత్రులు, సర్వీస్ స్టేషన్ల సేవలనూ పొందవచ్చు. సరే! మీ మొబైల్‌లో మీ బీమా కంపెనీ యాప్ ఉందా? లేకుంటే వెంటనే డౌన్‌లోడ్ చేయండి మరి!!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement