మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సర్వీసులు
న్యూఢిల్లీ : నెట్‌వర్క్ నచ్చకపోతే.. ఇన్నిరోజులు మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ద్వారా మొబైల్ నెంబర్ మార్చుకోకుండానే.. ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారేవాళ్లం. కానీ ఇక నుంచి ఈ ప్రక్రియ కష్టతరం అయ్యే అవకాశాలున్నాయట. దేశంలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సేవలను అందిస్తున్న ఇంటర్ కనెక్షన్ టెలికాం సొల్యూషన్స్, సినివెర్స్ టెక్నాలజీస్ సంస్థలు ఎంఎన్‌పీ సేవలను 2019 మార్చి నుంచి నిలిపివేయనున్నాయని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. పోర్టింగ్ ఛార్జీలను భారీ ఎత్తున్న తగ్గించడంతో, ఈ సర్వీసులను నిలిపివేయనున్నామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ)కి ఈ కంపెనీలు లేఖ రాసినట్టు రిపోర్టు పేర్కొంది. ఒకవేళ ఈ కంపెనీలు అన్నట్టుగానే సర్వీసులను నిలిపివేస్తే... వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు మారడం ఇక అంత సులువు కాదు.
ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఎంఎన్‌పీ ఫీజులను టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ 19 రూపాయల నుంచి 4 రూపాయల వరకు అంటే 80 శాతం మేర తగ్గించింది. అప్పటి నుంచి తాము నష్టాలను చవిచూస్తున్నామని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి తమ లైసెన్స్ ముగియగానే ఎంఎన్‌పీ సేవలు నిలిపివేస్తామని డీఓటీకి తాజాగా రాసిన లేఖలో ఈ రెండు కంపెనీలు పేర్కొన్నాయని రిపోర్టు వెల్లడించింది. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా కేవలం ఒకే లైసెన్స్ సర్వీసు ఏరియాలో మాత్రమే కాక, ప్యాన్ ఇండియా నెట్‌వర్క్‌ను మార్చుకోవచ్చు. మరోవైపు ఈ సర్వీసులను కొనసాగించడానికి మరో కొత్త సర్వీసు కంపెనీలకు లైసెన్స్ ఇచ్చే అవకాశాలున్నాయని టెలికాం వర్గాలంటున్నాయి.
వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు, కంపెనీలు నాణ్యమైన సేవలు అందించేలా ప్రభుత్వం ఎంఎన్‌పీ విధానాన్ని ప్రవేశపెట్టింది. జియో రాకతో రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీసర్వీసెస్, ఎయిర్‌సెల్, టెలీనార్ ఇండియా తదితర కంపెనీలు మూతపడ్డాయి. దీంతో నెలవారీ ఎంఎన్‌పీ రిక్వెస్టుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఒక్క మార్చి నెలలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ అభ్యర్థనలు 19.67 మిలియన్లకు పెరిగాయి. మరోవైపు తమ వినియోగదారులను కాపాడుకొనేందుకు దిగ్గజ టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా తదితర కంపెనీలు కూడా భారీగా తమ టారిఫ్‌లను తగ్గిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment