మే 3 నాటికి పూర్తిస్థాయి నంబర్ పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: పూర్తిస్థాయి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ)ని వచ్చే ఏడాది మే 3 కల్లా అమల్లోకి తీసుకురావాలని టెలికం కంపెనీలకు కేంద్రం నిర్ధేశించింది. ఈ నెల 3న టెల్కోలకు రాసిన లేఖలో టెలికం శాఖ ఈ ఆదేశాలను జారీచేసింది. మొబైల్ యూజర్లు తమ టెలికం ఆపరేటర్‌ను మార్చినా అదే నంబర్‌ను కొనసాగించుకునేందుకు ఎంఎన్‌పీ ఉపయోగపడుతుంది.
అయితే, ప్రస్తుతం(2010-11 నుంచి) పాక్షిక ఎంఎన్‌పీ అమల్లో ఉంది. అంటే ఒకే సర్కిల్‌లో నంబర్ మారకుండా టెల్కోలను మార్చుకునేందుకు వీలవుతుంది. ఇప్పుడు పూర్తిస్థాయి ఎంఎన్‌పీ అమల్లోకివస్తే... దేశంలోని అన్ని సర్కిళ్లలో ఏ టెల్కో సేవలకు మారినా యూజర్లు అదే మొబైల్ నంబర్‌ను వాడుకునే చాన్స్ లభిస్తుంది.
ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఒక టెలికం కంపెనీ కస్టమర్.. తన నంబర్‌ను మార్చకుండానే పంజాబ్‌లోని మరో టెలికం ఆపరేటర్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లు/సర్వీస్ ఏరియాలు ఉన్నాయి. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం... ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఎంఎన్‌పీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అంచనా.