Telecom Regulatory Authority of India
-
వాటికి నిబంధనలు అవసరం లేదు : ట్రాయ్
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ వంటి ఓటీటీ సేవలను అందిస్తున్న ప్లాట్‌ఫామ్‌లకు ఎలాంటి నిబంధనలు అవసరం లేదని టెలికాం వాచ్డాగ్ సోమవారం తెలిపింది. సంభావ్య పరిమితుల ముప్పును పక్కనబెట్టి ఓవర్-ది-టాప్(ఓటీటీ) కమ్యూనికేషన్ సేవలకు ప్రస్తుతం రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ అవసరం లేదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం సూచించిన చట్టాలు, నిబంధనలకు మించి, ఓటీటీ లాంటి వివిధ అంశాల కోసం సమగ్ర నియంత్రణ చట్రాన్నిసిఫారసు చేసేందుకు ఇది సరైన సందర్భం కాదు" అని ట్రాయ్ స్పష్టం చేసింది. ఓటీటీ సేవల గోప్యత, భదత్రకు సంంబంధించిన రెగ్యులేటరీ జోక్యం అవసరం లేదని కూడా ట్రాయ్ వెల్లడించింది. (ఫేస్బుక్ ఇండియా ఎండీకి నోటీసులు) ట్రాయ్ నిర్ణయాన్నినెట్ న్యూట్రాలిటీ కార్యకర్తలు స్వాగతిస్తుండగా, మరోవైపు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తీవ్రంగా వ్యతిరేకించింది. ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ (టీఎస్పీ) మధ్య సమస్యల్ని పరిష్కరించలేదని, ఇది టీఎస్పీలకు నష్టదాయకమని కోయ్ డైరెక్టర్ జనరల్ కొచ్చర్ ఆరోపించారు. అటు ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ తాజా పరిణామంపై ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా భారతదేశంలోని టెలికాం సంస్థలు ఇంటర్నెట్ ద్వారా ఉచిత వాయిస్, టెక్స్ట్ సేవలను అందించే యాప్స్ నియంత్రణ కోసం చాలాకాలంగా లాబీయింగ్ చేస్తున్నాయి. వీటిద్వారా సోషల్ మీడియా సంస్థలు తమ ఆదాయానికి గండికొడుతున్నాయని వాపోతున్న సంగతి తెలిసిందే. -
ఆధార్ నంబర్ ట్వీట్ చేసి.. చాలెంజ్ !
న్యూఢిల్లీ: భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చైర్మన్ ఆర్ఎస్ శర్మ శనివారం తన ఆధార్ నంబర్‌ను ట్వీట్ చేసి.. సవాల్ విసిరారు. 12 అంకెల తన ఆధార్ నంబర్‌ను తెలుసుకోవడం ద్వారా ఎలా తనకు హాని చేయగలరో నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. ఆధార్ నంబర్, తదితర వివరాలు బహిర్గతమవ్వడం ద్వారా అవి దుర్వినియోగమయ్యే అవకాశముందని, ఆర్థిక వ్యవహారాలతోపాటు వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శర్మ ఈ ట్వీట్ చేశారు. ‘నా ఆధార్ నంబర్ ఇది.. (ఇక్కడ వెల్లడి చేయడం లేదు). ఈ వివరాలతో ఎలా నాకు హాని చేయగలరో ఒక్క సరైన ఉదాహరణ నాకు చూపండి. ఇది నా చాలెంజ్’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ఆధార్ కార్డులను జారీచేసే భారత విశిష్ట గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) మాజీ డైరెక్టర్ జనరల్ అయిన శర్మ ఓ ట్వీట్‌కు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఆధార్ వివరాలు చాలా భద్రమని మీరు భావిస్తే.. మీ ఆధార్ కార్డు వివరాలు బహిర్గతం చేయండంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు బదులిచ్చారు. శర్మ బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబర్‌ను అనుసంధానించలేదని ఫ్రెంచ్ సెక్యూరిటీ పరిశోధకుడు ఒకరు ఆరోపించారని ఓ నెటిజన్ పేర్కొనగా.. ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. సమాచార భద్రత, ఆధార్ వివరాల పరిరక్షణ విషయమై ఆధార్ చట్టంలో పలు సవరణలు సూచిస్తూ.. శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించిన మరునాడే శర్మ ఈ చాలెంజ్ చేయడం గమనార్హం. అయితే, శర్మ ట్వీట్ చేసిన ఆధార్ నెంబర్ ఆధారంగా ఆయన ఇంటి చిరునామా, జన్మదినం, ఫోన్ నంబర్, పాన్ నెంబర్ తదితర వివరాలు రాబట్టినట్టు పలువురు నెటిజన్లు ట్వీట్ చేస్తుండటం కొసమెరుపు. -
రోమింగ్ చార్జీలు తగ్గాయ్..
కాల్ చార్జీలు 40 శాతం వరకూ - ఎస్ఎంఎస్ చార్జీలు 75% వరకూ - నేటి నుంచి వర్తింపు న్యూఢిల్లీ: రోమింగ్ చార్జీలు దిగివస్తున్నాయి. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి దిగ్గజ టెలికాం కంపెనీలు రోమింగ్ చార్జీలను 75 శాతం వరకూ తగ్గించాయి. ఈ తగ్గింపు నేటి (మే1-శుక్రవారం) నుంచి అమలవుతుంది. రోమింగ్‌లో ఉన్నప్పుడు కాల్స్ చార్జీలు 40 శాతం వరకూ, ఎస్ఎంఎస్ చార్జీలు 75 శాతం వరకూ తగ్గాయి. గత నెల 9న టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నేషనల్ రోమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ టారిఫ్‌ల పరిమితులను తగ్గించింది. దీంతో టెలికం కంపెనీలు తాజా నిర్ణయం తీసుకున్నాయి. ఎయిర్టెల్: ఇన్కమింగ్ కాల్ రేట్లు 40 శాతం వరకూ, అవుట్ గోయింగ్ (ఎస్టీడీ) కాల్ రేట్లు 23 శాతం వరకూ. అవుట్ గోయింట్ లోకల్ కాల్ రేట్లు 20 శాతం వరకూ, లోకల్ ఎస్ఎంఎస్ రేట్లు 75 శాతం వరకూ, ఎస్టీడీ ఎస్ఎంఎస్ రేట్లు 74 శాతం వరకూ తగ్గించింది. ఐడియా సెల్యులర్: ఇన్కమింగ్ కాల్స్‌ను 40 శాతం తగ్గించింది. అవుట్ గోయింగ్ లోకల్ కాల్ రేట్లను 20 శాతానికి, అవుట్ గోయింగ్ ఎస్టీడీ కాల్ రేట్లను 23 శాతం చొప్పున తగ్గించింది. ఆర్‌కామ్: ఇన్కమింగ్ కాల్స్ చార్జీలను 40 శాతం తగ్గించామని వివరించింది. అవుట్ గోయింగ్ కాల్స్ (లోకల్, ఎస్టీడీల) చార్జీలను 23 శాతం వరకూ తగ్గించామని పేర్కొంది. -
ల్యాండ్‌లైన్ కాల్ చార్జీలు తగ్గుతాయ్
- ఐయూసీ ,ఎఫ్‌టీసీ, ఎంటీసీ తొలగింపు - ల్యాండ్‌లైన్ నెట్వర్క్ వృద్ధి కోసం ట్రాయ్ చర్యలు న్యూఢిల్లీ: ల్యాండ్‌లైన్ కనెక్షన్ల జోరును పెంచడానికి, లాండ్‌లైన్ నెట్వర్క్ వృద్ధి కోసం, ఈ రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయాలు తీసుకుంది. ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి చేసే కాల్స్‌కు ఇంటర్ కనెక్షన్ యూసేజీ చార్జీలను(ఐయూసీ) పూర్తిగా తొలగించింది. గతంలో ఈ చార్జీ కాల్‌కు 20 పైసలుగా ఉండేది. ఇక మొబైల్ ఫోన్ల నుంచి చేసే కాల్స్‌కు ఐయూసీ చార్జీలను కాల్‌కు 20 పైసల నుంచి 14 పైసలకు(30 శాతం) తగ్గించింది. మొబైల్స్ నుంచి ల్యాండ్‌లైన్‌కు చేసే కాల్స్‌కు ఫిక్స్డ్ టెర్మినేషన్ చార్జీలు(ఎఫ్‌టీసీ)కూడా ఇకపై ఉండవు. ఆలాగే ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్లకు చేసే కాల్స్‌కు మొబైల్ టెర్మినేషన్ చార్జీలు(ఎంటీసీ) ఉండవు. ఈ నిర్ణయతో ల్యాండ్‌లైన్ కాల్ రేట్లు తగ్గుతాయని ట్రాయ్ పేర్కొంది. -
మే 3 నాటికి పూర్తిస్థాయి నంబర్ పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: పూర్తిస్థాయి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ)ని వచ్చే ఏడాది మే 3 కల్లా అమల్లోకి తీసుకురావాలని టెలికం కంపెనీలకు కేంద్రం నిర్ధేశించింది. ఈ నెల 3న టెల్కోలకు రాసిన లేఖలో టెలికం శాఖ ఈ ఆదేశాలను జారీచేసింది. మొబైల్ యూజర్లు తమ టెలికం ఆపరేటర్‌ను మార్చినా అదే నంబర్‌ను కొనసాగించుకునేందుకు ఎంఎన్‌పీ ఉపయోగపడుతుంది. అయితే, ప్రస్తుతం(2010-11 నుంచి) పాక్షిక ఎంఎన్‌పీ అమల్లో ఉంది. అంటే ఒకే సర్కిల్లో నంబర్ మారకుండా టెల్కోలను మార్చుకునేందుకు వీలవుతుంది. ఇప్పుడు పూర్తిస్థాయి ఎంఎన్‌పీ అమల్లోకివస్తే... దేశంలోని అన్ని సర్కిళ్లలో ఏ టెల్కో సేవలకు మారినా యూజర్లు అదే మొబైల్ నంబర్‌ను వాడుకునే చాన్స్ లభిస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఒక టెలికం కంపెనీ కస్టమర్.. తన నంబర్‌ను మార్చకుండానే పంజాబ్‌లోని మరో టెలికం ఆపరేటర్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లు/సర్వీస్ ఏరియాలు ఉన్నాయి. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం... ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఎంఎన్‌పీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అంచనా. -
లూప్ నుంచి తప్పుకున్న ఎయిర్టెల్
న్యూఢిల్లీ: టెలికం సేవల దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ముంబైకి చెందిన లూప్ మొబైల్‌ను కొనుగోలు చేసే ప్రణాళికలనుంచి తప్పుకుంది. లూప్‌ను కొనుగోలు చేసేందుకు రూ. 700 కోట్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఫిబ్రవరిలో కుదిరిన ఈ ఒప్పందానికి టెలికం శాఖ(డాట్) నుంచి అనుమతి లభించాల్సి ఉంది. దీంతో 17 లక్షలమంది వినియోగదారులు కలిగిన లూప్... ఎయిర్‌టెల్‌తో విలీనమయ్యే అవకాశాన్ని పోగొట్టుకుంది. ఈ అంశాన్ని బీఎస్ఈకి వెల్లడిస్తూ ఎయిర్టెల్ ఇప్పటివరకూ డాట్ అనుమతులు లభించకపోగా, ఈ నెలతో లూప్ లెసైన్స్ గడువు ముగిసిపోతున్నదని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత కొనుగోలు ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలిపింది. 2012 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు రద్దు చేసిన 122 టెలికం లెసైన్స్లలో లూప్ టెలికం కూడా ఉండటంతో ఖైతాన్ గ్రూప్ కంపెనీ అయిన లూప్ మొబైల్‌కు దెబ్బ త గిలిన సంగతి తెలిసిందే. కాగా, మిగిలిన ముంబై సర్కిల్ లెసైన్స్ గడువు సైతం ఈ నెల 29తో ముగియనుంది. నిజానికి ముంబై కార్యకలాపాలను కొనసాగించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్వహించిన వేలంలో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే లూప్ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేరు దాదాపు 3% క్షీణించి రూ. 385 వద్ద ముగిసింది. -
టెలిఫోన్ యూజర్లు @ 94.64 కోట్లు
న్యూఢిల్లీ: భారత్‌లో మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య జూలై చివరినాటికి 94.64 కోట్లకు పెరిగిందని ట్రాయ్ బుధవారం తెలిపింది. జూలైలో 34.5 లక్షల మంది కొత్తగా టెలిఫోన్ వినియోగదారులయ్యారని టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) పేర్కొంది. ఇతర వివరాలు.... ఈ ఏడాది జూన్ చివరి నాటికి 94.29 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది జూలై నాటికి 0.37 శాతం వృద్ధితో 94.64 కోట్లకు చేరింది. పట్టణ వినియోగదారుల సంఖ్య 55.97 కోట్ల నుంచి 56.24 కోట్లకు, గ్రామీణ వినియోగదారుల సంఖ్య 38.31 కోట్ల నుంచి 38.39కోట్లకు చేరింది. టెలిఫోన్ సాంద్రత 75.80 శాతం నుంచి 76 శాతానికి పెరిగింది. మొత్తం వెర్లైస్ వినియోగదారుల సంఖ్య 91.49 కోట్ల నుంచి 0.42 శాతం వృద్ధితో 91.87 కోట్లకు చేరింది. మొత్తం వెర్లైస్ టెలి డెన్సిటీ 73.78 శాతానికి పెరిగింది. మొత్తం వెర్లైస్ వినియోగదారుల మార్కెట్లో ప్రైవేట్ రంగం వాటా 90 శాతంగా ఉండగా, ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ల వాటా 10 శాతంగా ఉంది. జూలైలో మొబైల్ నంబర్ పోర్టబిలిటి(ఎంఎన్‌పీ) కోసం 28.6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 6.88 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో 7.08 కోట్లకు పెరిగింది. -
పార్టీలకు ‘మీడియా’లో ప్రవేశం వద్దు
* కార్పొరేట్ల ప్రవేశానికీ ఆంక్షలుండాలి * పెయిడ్ న్యూస్‌ను స్పష్టంగా పేర్కొనాలి * ట్రాయ్ సిఫారసులు న్యూఢిల్లీ: ప్రచురణ, ప్రసార మీడియాల్లో రాజకీయ జోక్యాన్ని, ఒత్తిడిని నివారించే ఉద్దేశంతో భారత టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) మంగళవారం పలు సిఫారసులు చేసింది. ’మీడియా -యాజమాన్యపరమైన అంశాల’పై ట్రాయ్ రూపొందించిన సిఫార్సులను ట్రాయ్ చెర్మన్ రాహుల్ ఖుల్లర్ విడుదల చేశారు. కార్పొరేట్ యాజమాన్యంలోని మీడియా సంస్థలో పనిచేసే సంపాదకవర్గం, వాస్తవంగా ఎంతమేర స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తోందో పరిశీలించాలని ఈ సందర్భంగా ఖుల్లర్ అభిప్రాయపడ్డారు. సంపాదకవర్గానికి చెందిన న్యూస్ రూమ్‌కు.. యాజమాన్యానికి చెందిన బోర్డ్ రూమ్‌కు మధ్య విభజనరేఖ ఎంత బలహీనంగా ఉందో పరిశీలన జరపాలన్నారు. వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేసేటపుడు అది ప్రకటనే అన్న విషయాన్ని స్పష్టంగా వివరించాలని ట్రాయ్ సూచించింది. ట్రాయ్ సిఫారసుల్లో కొన్ని.. - ఈ రంగంలో రాజకీయ పార్టీలు ప్రవేశించకుండా నిషేధం విధించాలి. - పెయిడ్ వార్తలకు సంబంధించి ఆ వార్త పై భాగంలో స్పష్టంగా కనిపించేలా ‘కింది సమాచారం చెల్లింపు వార్త(పెయిడ్ న్యూస్)’ అని పేర్కొనాలి. - ఒక నేతకు అనుకూలంగా పెయిడ్ న్యూస్ ప్రచురణ/ ప్రసారమై ఉంటే, ఆ నేతతో పాటు మీడియా సంస్థనూ బాధ్యులను చేయాలి. - పార్టీలతో పాటు మత సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ నిధులు పొందిన సంస్థలు వార్తాప్రసార, వార్తాప్రచురణల్లోకి రాకుండా నిషేధం విధించాలి. వాటి అనుబంధ సంస్థలకూ అవకాశం ఇవ్వకూడదు. - అలాంటి సంస్థలకు ఇప్పటికే లెసైన్సులు ఇచ్చి ఉంటే, ఆ రంగం నుంచి బయటకు వచ్చే మార్గం వాటికి చూపాలి. - ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంస్థల్లో.. అవి ఒకే యాజమాన్య సంస్థ కింద ఉంటే.. అందులో ఒక యజమానికి 32% కన్నా ఎక్కువ వాటా ఉండకూడదు. -
ఎంఎన్‌పీ వినియోగదార్లు @ 10 కోట్లు
న్యూఢిల్లీ: భారత్‌లో ఇప్పటివరకూ మొబైల్ నంబర్ పోర్టబిలిటి(ఎంఎన్‌పీ)ని వినియోగించుకున్న వారి సంఖ్య 10 కోట్లుగా ఉందని టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెలిపింది. ఇది మొత్తం మొబైల్ వినియోగదారుల్లో ( ఈ ఏడాది మార్చి 31 నాటికి 90.45 కోట్లు) 11 శాతానికి సమానమని పేర్కొంది. ఏదైనా ఒక టెలికాం సర్కిల్లో మొబైల్ నంబర్‌ను మార్చుకోకుండానే, టెలికాం ఆపరేటర్‌ను మార్చుకునే సౌకర్యాన్ని ఎంఎన్‌పీ అంటారు. ఇది అమల్లోకి వచ్చి మూడేళ్లయింది. కాగా, ఎంఎన్‌పీ పోర్టింగ్ చార్జీలను ట్రాయ్ రూ.19గా నిర్ణయించింది. ఎంఎన్‌పీ నిబంధనలను ఉల్లంఘించిన, పోర్టింగ్ విజ్ఞప్తులను తిరస్కరించిన టెలికాం కంపెనీలపై ట్రాయ్ ఇప్పటిదాకా రూ.8 కోట్ల జరిమానాలను వడ్డించింది. కాగా నంబర్‌ను మార్చుకోకుండానే దేశవ్యాప్తంగా వేరే టెలికాం ఆపరేటర్‌ను మార్చుకునే పూర్తి మొబైల్ నంబర్ పోర్టబిలిటికి సంబంధించి ప్రతిపాదనలను ట్రాయ్ ఇప్పటికే రూపొందించింది. ఈ పూర్తి ఎంఎన్‌పీ ప్రతిపాదనలపై టెలికాం డిపార్ట్మెంట్ ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. -
పల్లెల్లో మొబైల్ కనెక్షన్ల జోరు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ కనెక్షన్లు జోరుగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చినెలలో నికర మొబైల్ టెలిఫోన్ కనెక్షన్లు 11.5 లక్షలు పెరిగాయని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది. దీంతో భారత్‌లో మొత్తం వెర్లైస్ వినియోగదారుల సంఖ్య 90.45 కోట్లకు, మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 93.3 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఇవీ వివరాలు... ఫిబ్రవరి చివరి నాటికి 93.1 కోట్లకుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 0.11 శాతం వృద్ధితో 93.3 కోట్లకు చేరింది. పల్లె ప్రాంతాల్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరిగిపోతోంది. ఫిబ్రవరిలో 37.49 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య మార్చిలో 37.77 కోట్లకు పెరిగింది. మరో వైపు పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల సంఖ్య తగ్గింది. ఈ సంఖ్య 55.69 కోట్ల నుంచి 55.52 కోట్లకు క్షీణించింది. మార్చిలో ఐడియా సెల్యులర్కు వరుసగా రెండో నెలలో అధికంగా కొత్త వినియోగదారులు లభించారు. కొత్తగా చేరిన 22 లక్షల మంది వినియోగదారులతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 13.57 కోట్లకు పెరిగింది. ఐడియా తర్వాత వొడాఫోన్‌కు అధిక సంఖ్యలో వినియోగదారులు లభించారు. ఈ కంపెనీకి 22.1 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. ఎయిర్‌టెల్‌కు 18.9 లక్షల మంది, ఎయిర్‌సెల్‌కు 10 లక్షల మంది, యూనినార్‌కు 7.1 లక్షల మంది, వీడియోకాన్‌కు 3.2 లక్షల మంది, సిస్టమకు 2.4 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. ఆర్‌కామ్‌తో పాటు, బీఎస్ఎన్ఎల్, టాటా టెలి సర్వీసెస్, ఎంటీఎన్ఎల్, లూప్ కంపెనీల వినియోగదారుల సంఖ్య తగ్గింది. బీఎస్ఎన్ఎల్కు 1.8 లక్షల మంది, టాటా టెలి సర్వీసెస్‌కు 1.4 లక్షల మంది, ఎంటీఎన్ఎల్ 1.3 లక్షల మంది, లూప్ మొబైల్ 40 వేల మంది తగ్గారు. వాడుకలో లేని 70 లక్షల వినియోగదారుల నంబర్లను రిలయన్స్ కమ్యూనికేషన్స్ తొలగించింది. అయినప్పటికీ, 11 కోట్ల మంది వినియోగదారులతో ఆర్‌కామ్ నాలుగో పెద్ద టెలికాం కంపెనీగా తన స్థానాన్ని నిలుపుకుంది. ఫిబ్రవరిలో 5.8 కోట్లుగా ఉన్న బ్రాడ్‌బాండ్ విని యోగదారుల సంఖ్య మార్చిలో 28.7 లక్షల (5%) వృద్ధితో 6.08 కోట్లకు చేరింది. వీటిల్లో వెర్లైస్ బ్రాడ్‌బాండ్ కనెక్షన్ల సంఖ్య 4.56 కోట్లుగా, ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బాండ్ కనెక్షన్ల సంఖ్య 1.48 కోట్లు. -
వైర్లెస్ నెట్‌కు ఇక కనీస స్పీడ్!
న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదార్లకు కనీస డేటా డౌన్లోడ్ స్పీడ్‌పై టెలికం కంపెనీల నుంచి త్వరలో స్పష్టమైన, కచ్చితమైన హామీ లభించనుంది. ఈ మేరకు త్వరలో టెల్కోలకు నింయత్రణ సంస్థ ట్రాయ్ మార్గదర్శకాలను జారీచేసేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో 2జీ లేదా 3జీ ఏ మొబైల్ సేవలకైనా ఇంటర్నెట్ద్వారా కనీస డౌన్లోడ్ స్పీడ్ ఎంతనే వివరాలను టెల్కోలు తప్పనిసరిగా తమ కస్టమర్లకు వెల్లడించాల్సి ఉంటుంది. తమ మొబైల్స్‌లో ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటుందని యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ట్రాయ్ దీనిపై దృష్టిసారించింది. తాజాగా విడుదల చేసిన చర్చాపత్రంలో పలు ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం టెల్కోలకు వైర్లెస్ డేటా సేవలకు సంబంధించి కనీస స్పీడ్‌ను అందించే విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. దీంతో కొన్ని కంపెనీలు సెకనుకు 7.2 మెగాబైట్స్(ఎంబీపీఎస్), మరికొన్ని 21 ఎంబీపీఎస్ అంటూ అధిక డేటా స్పీడ్ లతో కస్టమర్లకు ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. తీరా వాడకానికొస్తే డౌన్లోడింగ్ సమయంలో తగిన స్పీడ్ లేక యూజర్లు ఉసూరుమనాల్సిన పరిస్థితి నెలకొంది. హైస్పీడ్ 3జీ నెట్‌వర్క్‌లో కనీస డౌన్లోడ్ స్పీడ్ ప్రస్తుతం 399 కేబీపీఎస్ నుంచి 2.48 ఎంబీపీఎస్‌గా స్థాయిలో ఉంది. కాగా, 3జీ, సీడీఎంఏ(ఈవీడీఓ డాంగిల్) సేవల్లో కనీస డౌన్లోడ్ స్పీడ్ 1 ఎంబీపీఎస్‌గా(95% కచ్చితత్వం) నిర్ణయించాలని ట్రాయ్ ప్రతిపాదించింది. అదేవిధంగా జీఎస్ఎం, సీడీఎంఏ 2జీ సేవలకు కనీస డౌన్లోడ్ స్పీడ్ 56 కేబీపీఎస్‌గా, సీడీఎంఏ హైస్పీడ్ డేటా సేవలకు 512 కేబీపీఎస్‌గా చేయాలనుకుంటోంది. అంతేకాదు ప్రతి టారిఫ్ ప్లాన్‌కు సంబంధించి కనీస డౌన్లోడ్ స్పీడ్‌ను రీచార్జ్ వోచర్లు, వెబ్సైట్లు, యాడ్లలో కూడా కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ చర్చాపత్రంపై అన్నివర్గాలు అభిప్రాయలు తెలిపేందుకు మే 5 వరకు గడువుఇచ్చింది. -
కేబుల్ టీవీ రేట్లు పై పై కి ..!
న్యూఢిల్లీ: కేబుల్ టీవీ వీక్షకులకు ఈ ఉగాది కాస్త చేదుని కూడా వెంట తెచ్చింది. డిజిటైజేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాని నగరాల్లో కేబుల్ టీవీ టారిఫ్‌లు 15% దాకా పెరగనున్నాయి. ఈ దిశగా ఆపరేటర్లకు వెసులుబాటు కల్పిస్తూ టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఆదేశాలు ఇచ్చింది. దీంతో మంగళవారం (నేడు) నుంచే పెంపు అమల్లోకి రానుంది. వాస్తవానికి కేబుల్ ఆపరేటర్లు 27.5% మేర రేట్లను పెంచుకునేందుకు ట్రాయ్ అనుమతించింది. అయితే, ఇంత భారాన్నీ అనలాగ్ టీవీ వినియోగదారులపై ఒకే మారు మోపకుండా విడతలవారీగా పెంచాలని సూచించింది. దీని ప్రకారం మంగళవారం నుంచి తొలి దశలో కేబుల్ సబ్స్క్రిప్షన్ చార్జీలను 15% దాకా పెంచుకునే వెసులుబాటు ఆపరేటర్లకు లభించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రెండో విడత పెంపును అమలు చేయొచ్చు. తద్వారా సంబంధిత వర్గాలు చార్జీల పెంపునకు అల వాటు పడేందుకు సమయం లభించగలదని ట్రాయ్ భావిస్తోంది. కేబుల్ చార్జీలకు సంబంధించి ఈ పెంపు గత పదేళ్లలో నాలుగోది. ద్రవ్యోల్బణాన్ని బట్టి 2005లో ఏడు శాతం, 2006లో నాలుగు శాతం, 2009లో ఏడు శాతం మేర చార్జీలు పెంచుకునేందుకు ఆపరేటర్లకు వీలు లభించింది. తాజాగా 2004 నాటి టారిఫ్ ఆర్డర్లను పునఃసమీక్షించేందుకు అనుమతించే విషయంలో ట్రాయ్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. గత నెల అనుమతి లభించింది. దీని ప్రకారం ట్రాయ్ టారిఫ్‌లను సవరిస్తూ ఆదేశాలిచ్చింది. తొలి, రెండో విడత డిజిటైజేషన్ ప్రక్రియ జాబితాలో ఉన్న నగరాలకు మినహాయింపు ఉంటుంది. అయితే, ఈ నగరాల్లో చార్జీల విషయంలో ఏకరూపత ఉండేందుకు ట్రాయ్ ఆమోదించిన అనలాగ్ రేట్ల ఆధారంగా డిజిటల్ రేట్లను సవరించాల్సి ఉంటుంది. అనలాగ్..డిజిటల్.. పాత తరం నాటి అనలాగ్ సిగ్నల్స్, ఆధునిక డిజిటల్ సిగ్నల్స్ రూపంలో ప్రస్తుతం టీవీ కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అస్పష్టంగా ఉండే.. అనలాగ్ సిగ్నల్స్ స్థానంలో డిజిటల్ సిగ్నల్స్ అందుకునేలా సెట్ టాప్ బాక్సులను ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడం, ఆ దిశగా ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతుండటం తెలిసిందే. సమాలోచనల్లో ఆపరేటర్లు..: చార్జీల పెంపు అంశంపై కేబుల్ టీవీ ఆపరేటర్లు సమాలోచనలు జరుపుతున్నారు. ట్రాయ్ ఆదేశాలను పూర్తిగా చదివి, పరిశ్రమ ఒక నిర్ణయానికి వచ్చే దాకా పెంపు ఎంత ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని సిటీ కేబుల్, హిందుజా మీడియా వెంచర్స్ తదితర సంస్థల వర్గాలు పేర్కొన్నాయి. చార్జీల పెరుగుదల ఎకాయెకిన 15 శాతం ఉండకపోవచ్చని, అంత కన్నా తక్కువే ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే డిజిటల్ సిగ్నల్స్‌కి మారిన ప్రాంతాల్లో కస్టమర్లపై దీని ప్రభావం తక్షణం ఉండకపోవచ్చని వివరించాయి. సబ్స్క్రిప్షన్ ప్రారంభమైన ఆరు నెలల దాకా కేబుల్ చార్జీలను మార్చకూడదన్న నిబంధన ఇందుకు కారణమని పేర్కొన్నాయి. ఫలితంగా కొత్త కస్టమర్లకు మాత్రమే ఈ చార్జీలు వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘కాగ్ ఆడిట్’ ఉత్తర్వులతో కలకలం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయుంతో ముడిపడివున్న దృష్ట్యా ప్రైవేట్ టెలికామ్ కంపెనీల అకౌంట్లను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పరిశీలించవచ్చంటూ ఢిల్లీ హైకో ర్టు ఇచ్చిన ఉత్తర్వులు కలకలం సృష్టిస్తున్నా రుు. ఇతర రంగాల్లోని కంపెనీల ఖాతాలను కూడా తనిఖీ చేయూలనే డివూండ్లు రావచ్చనే అభిప్రాయుం వ్యక్తవువుతోంది. ‘ఆడిట్ విషయూనికి వస్తే, ప్రభుత్వ ఆధీనంలోని వ్యాపారాల విషయుంలో వూత్రమే పార్లమెంటుకు కాగ్ జవాబుదారీ అని మేం విశ్వసిస్తున్నాం. అందువల్ల ప్రైవేట్ కంపెనీల అకౌంట్లను కాగ్ ఆడిట్ చేయుజాలదు.’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో ఆదాయు పంపిణీ ఒప్పందాలున్నందున ప్రైవేట్ టెలికామ్ కంపెనీల ఆదాయూలను కాగ్ ఆడిట్ చేయువచ్చని కూడా సోవువారం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఢిల్లీ హైకోర్టు తెలిపింది. టెలికామ్ కంపెనీల వసూళ్లకు వూత్రమే కాగ్ ఆడిట్ పరిమితం కావాలని స్పష్టంచేసింది. అన్ని కంపెనీల ఆదాయూల కు కన్సాలిడేటెడ్ ఫండ్‌తో సంబంధవుున్న దృష్ట్యా ఇతర రంగాలపైన కూడా కోర్టు ఉత్తర్వుల ప్రభావం ఉండవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ రీసెర్చ్ అనలిస్ట్ అంకితా సోవూనీ పేర్కొన్నారు. -
అవాంఛిత కాల్స్ జరిమానా నిబంధనల సడలింపు
న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్‌కు విధించే జరిమానా నిబంధనలను ట్రాయ్ సరళీకరించింది. టెలీ మార్కెటింగ్ సంస్థల డిపాజిట్, రిజిష్ట్రేషన్ మొత్తాలను కూడా సగానికి తగ్గించింది. రూ. లక్షగా ఉన్న డిపాజిట్ మొత్తాన్ని రూ.50,000కు, రూ.10,000గా ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజును రూ.5,000కు తగ్గించింది. రిజిస్ట్రేషన్ కాల పరిమితిని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెం చింది. గతంలో ఒక్కో అవాంఛిత కాల్, ఎస్ఎంఎస్లపై ట్రాయ్ టెలికం ఆపరేటర్లపై రూ.5,000 వరకూ జరిమానా విధించేది. ఇప్పుడు దీనికి బదులుగా కొత్త స్లాబ్ ప్రకారం జరిమానాలు విధిస్తుంది. అవాంఛిత కాల్స్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకునే మొబైల్ ఆపరేటర్లకు నజరానాగా జరిమానా నిబంధనలను సవరించామని ట్రాయ్ పేర్కొంది. ఏ టెలికం ఆపరేటర్‌కి వ్యతిరేకంగా ఒక వారంలో 50 వరకూ ఫిర్యాదులొచ్చినా ఎలాంటి జరిమానా ఉండదు. ఒక వారంలో ఫిర్యాదుల సంఖ్య 50-300 వరకూ ఉంటే ఒక్కో ఫిర్యాదుకు రూ. 1,000 చొప్పున జరిమానా విధిస్తారు. ఫిర్యాదుల సంఖ్య 301 నుంచి 700 వరకూ ఉంటే ప్రతీ ఫిర్యాదుపైనా రూ. 2,000 జరిమానా ఉంటుంది. ఇక ఫిర్యాదుల సంఖ్య 700కు మించితే ఒక్కో ఫిర్యాదుపై రూ.5,000 జరిమానా విధిస్తారు. అవాంఛిత కాల్స్‌కు సంబంధించి ఫిర్యాదుల సంఖ్య తగ్గుతోందని ట్రాయ్ పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టులో వారానికి 12,848గా ఫిర్యాదుల సంఖ్య నవంబర్ 17న ముగిసిన వారంలో 4,046కు తగ్గింది. ఆటో రెన్యువల్‌కు అనుమతి తప్పనిసరి డేటా ప్యాక్‌లు, ఎస్ఎంఎస్లకు సంబంధించి స్పె షల్ టారిఫ్ ఓచర్లు(ఎస్టీఓ) రెన్యువల్‌కు వినియోగదారుల సమ్మతి తప్పనిసరని ట్రాయ్ మంగళవారం స్పష్టం చేసింది. టెలికం ఆపరేటర్లందించే ఈ తరహా స్పెషల్ టారిఫ్ ఓచర్ల ఆటో రెన్యువల్ విషయమై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. టెలికం కన్సూమర్స్ ప్రొటెక్షన్ (7వ సవరణ) నిబంధనలు, 2013కు సంబంధించిన మార్గదర్శకాలను ట్రాయ్ వెల్లడించింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 15 నుంచి అమల్లోకి వస్తాయి. ఇలాంటి ఎస్టీఓల గడువు తీరడానికి 3 రోజుల ముందే సంబంధిత ఎస్టీఓ రెన్యువల్ తేదీలు, చార్జీలు నిబంధనల వివరాలను వినియోగదారులకు తెలియజేయాలని ట్రాయ్ ఆదేశించింది. -
స్పెక్ట్రమ్ రేటు ఎక్కువైతే రుణాలివ్వలేం: ఎస్బీఐ
న్యూఢిల్లీ: త్రీజీ స్పెక్ట్రమ్ తరహాలోనే ఇకపైనా స్పెక్ట్రమ్ వేలం రేటు అధికంగా ఉంచిన పక్షంలో దాన్ని కొనుగోలు చేయడానికి టెలికం కంపెనీలకు బ్యాంకులు రుణాలివ్వకపోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. ఈ రుణాలను అన్సెక్యూర్డ్ లోన్స్గా పరిగణిస్తామని, వీటి కోసం ఖాతాల్లో అధికంగా ప్రొవిజనింగ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ భారం ఎక్కువగా ఉంటే.. క్రెడిట్ రేటింగ్ దెబ్బతింటుందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి ఎస్బీఐ వివరించింది. స్పెక్ట్రమ్ వేల్యుయేషన్ అంశంపై ఈ మేరకు ఎస్బీఐ తన అభిప్రాయాన్ని తెలిపింది. ఎక్స్చేంజీల ద్వారా స్పెక్ట్రమ్ ట్రేడింగ్ 3జీ స్పెక్ట్రమ్ మాత్రమే తీసుకున్న సంస్థలతో పోలిస్తే.. బీడబ్ల్యూఏ కూడా తీసుకున్న టెలికం కంపెనీలు పోటీలో ముందు ఉండగలవని పేర్కొంది. స్పెక్ట్రమ్‌ను ఎక్స్చేంజీల ద్వారా ట్రేడింగ్ చేసుకునేందుకు అనుమతించాలని అభిప్రాయపడింది. దీనివల్ల స్పెక్ట్రమ్‌ను మరింత సమర్ధంగా ఉపయోగించుకునేందుకు వీలవుతుందని పేర్కొంది. 2008లో ఆపరేటర్లు చెల్లించిన రేటుకంటే 11 రెట్లు ఎక్కువగా ప్రస్తుతం స్పెక్ట్రమ్ రేటు నిర్ణయించాలని ట్రాయ్ ప్రతిపాదిస్తోంది. అయితే, ఇది చాలా ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల కాల్ టారిఫ్‌లను భారీగా పెంచాల్సి వస్తుందని టెలికం కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.