పల్లెల్లో మొబైల్ కనెక్షన్ల జోరు | mobile phone usage increased in villages | Sakshi
Sakshi News home page

పల్లెల్లో మొబైల్ కనెక్షన్ల జోరు

Published Tue, May 13 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM

పల్లెల్లో మొబైల్ కనెక్షన్ల జోరు

పల్లెల్లో మొబైల్ కనెక్షన్ల జోరు

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ కనెక్షన్లు జోరుగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చినెలలో నికర మొబైల్ టెలిఫోన్ కనెక్షన్లు 11.5 లక్షలు పెరిగాయని  టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది. దీంతో భారత్‌లో మొత్తం వెర్లైస్ వినియోగదారుల సంఖ్య 90.45 కోట్లకు, మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 93.3 కోట్లకు పెరిగాయని పేర్కొంది.

ఇవీ వివరాలు...
ఫిబ్రవరి చివరి నాటికి 93.1 కోట్లకుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 0.11 శాతం వృద్ధితో  93.3 కోట్లకు చేరింది.  
పల్లె ప్రాంతాల్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరిగిపోతోంది. ఫిబ్రవరిలో 37.49 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య మార్చిలో 37.77 కోట్లకు పెరిగింది. మరో వైపు పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల సంఖ్య తగ్గింది. ఈ సంఖ్య 55.69 కోట్ల నుంచి 55.52 కోట్లకు క్షీణించింది.

మార్చిలో ఐడియా సెల్యులర్‌కు వరుసగా రెండో నెలలో అధికంగా కొత్త వినియోగదారులు లభించారు. కొత్తగా చేరిన 22 లక్షల మంది వినియోగదారులతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 13.57 కోట్లకు పెరిగింది.

ఐడియా తర్వాత వొడాఫోన్‌కు అధిక సంఖ్యలో వినియోగదారులు లభించారు. ఈ కంపెనీకి 22.1 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు.

ఎయిర్‌టెల్‌కు 18.9 లక్షల మంది, ఎయిర్‌సెల్‌కు 10 లక్షల మంది, యూనినార్‌కు 7.1 లక్షల మంది, వీడియోకాన్‌కు 3.2 లక్షల మంది, సిస్టమకు 2.4 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు.

ఆర్‌కామ్‌తో పాటు, బీఎస్‌ఎన్‌ఎల్, టాటా టెలి సర్వీసెస్, ఎంటీఎన్‌ఎల్, లూప్ కంపెనీల వినియోగదారుల సంఖ్య తగ్గింది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు 1.8 లక్షల మంది, టాటా టెలి సర్వీసెస్‌కు 1.4 లక్షల మంది, ఎంటీఎన్‌ఎల్ 1.3 లక్షల మంది, లూప్ మొబైల్ 40 వేల మంది  తగ్గారు.

వాడుకలో లేని 70 లక్షల వినియోగదారుల నంబర్లను రిలయన్స్ కమ్యూనికేషన్స్ తొలగించింది. అయినప్పటికీ, 11 కోట్ల మంది వినియోగదారులతో ఆర్‌కామ్ నాలుగో పెద్ద టెలికాం కంపెనీగా తన స్థానాన్ని నిలుపుకుంది.

ఫిబ్రవరిలో 5.8 కోట్లుగా ఉన్న బ్రాడ్‌బాండ్ విని యోగదారుల సంఖ్య మార్చిలో 28.7 లక్షల (5%) వృద్ధితో 6.08 కోట్లకు చేరింది. వీటిల్లో వెర్లైస్ బ్రాడ్‌బాండ్ కనెక్షన్‌ల సంఖ్య 4.56 కోట్లుగా, ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బాండ్ కనెక్షన్‌ల సంఖ్య 1.48 కోట్లు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement