ఎంఎన్‌పీ వినియోగదార్లు @ 10 కోట్లు
న్యూఢిల్లీ: భారత్‌లో ఇప్పటివరకూ మొబైల్ నంబర్ పోర్టబిలిటి(ఎంఎన్‌పీ)ని వినియోగించుకున్న వారి సంఖ్య 10 కోట్లుగా ఉందని టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెలిపింది. ఇది మొత్తం మొబైల్ వినియోగదారుల్లో ( ఈ ఏడాది మార్చి 31 నాటికి 90.45 కోట్లు) 11 శాతానికి సమానమని పేర్కొంది. ఏదైనా ఒక టెలికాం సర్కిల్‌లో మొబైల్ నంబర్‌ను మార్చుకోకుండానే, టెలికాం ఆపరేటర్‌ను మార్చుకునే సౌకర్యాన్ని ఎంఎన్‌పీ అంటారు.
ఇది అమల్లోకి వచ్చి మూడేళ్లయింది. కాగా, ఎంఎన్‌పీ పోర్టింగ్ చార్జీలను ట్రాయ్ రూ.19గా నిర్ణయించింది. ఎంఎన్‌పీ నిబంధనలను ఉల్లంఘించిన, పోర్టింగ్ విజ్ఞప్తులను తిరస్కరించిన టెలికాం కంపెనీలపై ట్రాయ్ ఇప్పటిదాకా రూ.8 కోట్ల జరిమానాలను వడ్డించింది. కాగా నంబర్‌ను మార్చుకోకుండానే దేశవ్యాప్తంగా వేరే టెలికాం ఆపరేటర్‌ను మార్చుకునే పూర్తి మొబైల్ నంబర్ పోర్టబిలిటికి సంబంధించి ప్రతిపాదనలను ట్రాయ్ ఇప్పటికే రూపొందించింది. ఈ పూర్తి ఎంఎన్‌పీ ప్రతిపాదనలపై టెలికాం డిపార్ట్‌మెంట్ ప్రస్తుతం కసరత్తు చేస్తోంది.