కేబుల్ టీవీ రేట్లు పై పై కి ..!
న్యూఢిల్లీ: కేబుల్ టీవీ వీక్షకులకు ఈ ఉగాది కాస్త చేదుని కూడా వెంట తెచ్చింది. డిజిటైజేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాని నగరాల్లో కేబుల్ టీవీ టారిఫ్‌లు 15% దాకా పెరగనున్నాయి. ఈ దిశగా ఆపరేటర్లకు వెసులుబాటు కల్పిస్తూ టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఆదేశాలు ఇచ్చింది. దీంతో మంగళవారం (నేడు) నుంచే పెంపు అమల్లోకి రానుంది. వాస్తవానికి కేబుల్ ఆపరేటర్లు 27.5% మేర రేట్లను పెంచుకునేందుకు ట్రాయ్ అనుమతించింది. అయితే, ఇంత భారాన్నీ అనలాగ్ టీవీ వినియోగదారులపై ఒకే మారు మోపకుండా విడతలవారీగా పెంచాలని సూచించింది.
దీని ప్రకారం మంగళవారం నుంచి తొలి దశలో కేబుల్ సబ్‌స్క్రిప్షన్ చార్జీలను 15% దాకా పెంచుకునే వెసులుబాటు ఆపరేటర్లకు లభించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రెండో విడత పెంపును అమలు చేయొచ్చు. తద్వారా సంబంధిత వర్గాలు చార్జీల పెంపునకు అల వాటు పడేందుకు సమయం లభించగలదని ట్రాయ్ భావిస్తోంది. కేబుల్ చార్జీలకు సంబంధించి ఈ పెంపు గత పదేళ్లలో నాలుగోది. ద్రవ్యోల్బణాన్ని బట్టి 2005లో ఏడు శాతం, 2006లో నాలుగు శాతం, 2009లో ఏడు శాతం మేర చార్జీలు పెంచుకునేందుకు ఆపరేటర్లకు వీలు లభించింది. తాజాగా 2004 నాటి టారిఫ్ ఆర్డర్లను పునఃసమీక్షించేందుకు అనుమతించే విషయంలో ట్రాయ్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. గత నెల అనుమతి లభించింది. దీని ప్రకారం ట్రాయ్ టారిఫ్‌లను సవరిస్తూ ఆదేశాలిచ్చింది. తొలి, రెండో విడత డిజిటైజేషన్ ప్రక్రియ జాబితాలో ఉన్న నగరాలకు మినహాయింపు ఉంటుంది. అయితే, ఈ నగరాల్లో చార్జీల విషయంలో ఏకరూపత ఉండేందుకు ట్రాయ్ ఆమోదించిన అనలాగ్ రేట్ల ఆధారంగా డిజిటల్ రేట్లను సవరించాల్సి ఉంటుంది.
అనలాగ్..డిజిటల్..
పాత తరం నాటి అనలాగ్ సిగ్నల్స్, ఆధునిక డిజిటల్ సిగ్నల్స్ రూపంలో ప్రస్తుతం టీవీ కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అస్పష్టంగా ఉండే.. అనలాగ్ సిగ్నల్స్ స్థానంలో డిజిటల్ సిగ్నల్స్ అందుకునేలా సెట్ టాప్ బాక్సులను ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడం, ఆ దిశగా ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతుండటం తెలిసిందే.
సమాలోచనల్లో ఆపరేటర్లు..: చార్జీల పెంపు అంశంపై కేబుల్ టీవీ ఆపరేటర్లు సమాలోచనలు జరుపుతున్నారు. ట్రాయ్ ఆదేశాలను పూర్తిగా చదివి, పరిశ్రమ ఒక నిర్ణయానికి వచ్చే దాకా పెంపు ఎంత ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని సిటీ కేబుల్, హిందుజా మీడియా వెంచర్స్ తదితర సంస్థల వర్గాలు పేర్కొన్నాయి. చార్జీల పెరుగుదల ఎకాయెకిన 15 శాతం ఉండకపోవచ్చని, అంత కన్నా తక్కువే ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే డిజిటల్ సిగ్నల్స్‌కి మారిన ప్రాంతాల్లో కస్టమర్లపై దీని ప్రభావం తక్షణం ఉండకపోవచ్చని వివరించాయి. సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైన ఆరు నెలల దాకా కేబుల్ చార్జీలను మార్చకూడదన్న నిబంధన ఇందుకు కారణమని పేర్కొన్నాయి. ఫలితంగా కొత్త కస్టమర్లకు మాత్రమే ఈ చార్జీలు వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.