స్పెక్ట్రమ్ రేటు ఎక్కువైతే రుణాలివ్వలేం: ఎస్‌బీఐ
స్పెక్ట్రమ్ రేటు ఎక్కువైతే రుణాలివ్వలేం: ఎస్‌బీఐ
Published Sat, Aug 17 2013 2:23 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
న్యూఢిల్లీ: త్రీజీ స్పెక్ట్రమ్ తరహాలోనే ఇకపైనా స్పెక్ట్రమ్ వేలం రేటు అధికంగా ఉంచిన పక్షంలో దాన్ని కొనుగోలు చేయడానికి టెలికం కంపెనీలకు బ్యాంకులు రుణాలివ్వకపోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. ఈ రుణాలను అన్‌సెక్యూర్డ్ లోన్స్‌గా పరిగణిస్తామని, వీటి కోసం ఖాతాల్లో అధికంగా ప్రొవిజనింగ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ భారం ఎక్కువగా ఉంటే.. క్రెడిట్ రేటింగ్ దెబ్బతింటుందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి ఎస్‌బీఐ వివరించింది. స్పెక్ట్రమ్ వేల్యుయేషన్ అంశంపై ఈ మేరకు ఎస్‌బీఐ తన అభిప్రాయాన్ని తెలిపింది.
ఎక్స్చేంజీల ద్వారా స్పెక్ట్రమ్ ట్రేడింగ్
3జీ స్పెక్ట్రమ్ మాత్రమే తీసుకున్న సంస్థలతో పోలిస్తే.. బీడబ్ల్యూఏ కూడా తీసుకున్న టెలికం కంపెనీలు పోటీలో ముందు ఉండగలవని పేర్కొంది. స్పెక్ట్రమ్‌ను ఎక్స్చేంజీల ద్వారా ట్రేడింగ్ చేసుకునేందుకు అనుమతించాలని అభిప్రాయపడింది. దీనివల్ల స్పెక్ట్రమ్‌ను మరింత సమర్ధంగా ఉపయోగించుకునేందుకు వీలవుతుందని పేర్కొంది. 2008లో ఆపరేటర్లు చెల్లించిన రేటుకంటే 11 రెట్లు ఎక్కువగా ప్రస్తుతం స్పెక్ట్రమ్ రేటు నిర్ణయించాలని ట్రాయ్ ప్రతిపాదిస్తోంది. అయితే, ఇది చాలా ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల కాల్ టారిఫ్‌లను భారీగా పెంచాల్సి వస్తుందని టెలికం కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Advertisement