
మొబైల్స్‌లో ‘సబ్ బ్రాండ్ల’ హవా
విలువ పెంచుకోవటానికి కంపెనీల పోటాపోటీ
♦ రంగంలో మైక్రోమ్యాక్స్, హువాయి, జెడ్‌టీఈ తదితరాలు
♦ ‘బ్లాక్’ పేరిట సబ్‌బ్రాండ్ బరిలోకి దిగుతున్న జోలో
♦ ఆరంభంలో ఆన్‌లైన్లో అమ్మకాలకే పరిమితం
♦ ఆన్‌లైన్‌తో అనేక లాభాలంటున్న విశ్లేషకులు
♦ హానర్.. ఒకే వైపు రెండు కెమెరాలున్న 6 ప్లస్‌ను తొలిసారి తెచ్చింది.
♦ నూబియా జెడ్9 మోడల్‌ను అంచులు లేని (బెజెల్ ఫ్రీ) స్క్రీన్‌తో రూపొందించింది. దీన్లో ఎస్‌ఎల్‌ఆర్ కెమెరా ఉంది.
♦ పేటెంటు కలిగిన ఫ్రేమ్‌లెస్ స్మార్ట్‌ఫోన్‌ను డాజెన్ తయారు చేసింది.
♦ బ్లాక్ సైతం ఒకే వైపు రెండు కెమెరాలున్న మోడల్‌ను తీసుకొస్తోంది.
♦ ప్రపంచవ్యాప్తంగా 2015లో 150 కోట్ల యూనిట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. దీన్లో భారత్ వాటా 11.8 కోట్లు. 2017కి ఈ సంఖ్య 170 కోట్లకు చేరొచ్చని విశ్లేషకులు చెబుతుండగా దీన్లో భారత్ వాటా 10.4%. అంటే.. 17.4 కోట్లు.
♦ 2014లో భారత్‌లో మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 8 కోట్ల యూనిట్లు. ఇందులో ఆన్‌లైన్ వాటా 15 శాతం మాత్రమే.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఒకే ఒక్క ఏడాది. ఏకంగా 1,137 మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తాయి. అలాగని వీటిని విడుదల చేసిన బ్రాండ్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. దాదాపు 95 బ్రాండ్లు పోటీలు పడుతూ ఈ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చాయి. సగటున చూస్తే ఒక్కో బ్రాండ్ ఏడాదికి 12 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చినట్లు. అదీ... మన దేశ మొబైల్ మార్కెట్ సత్తా. అందుకేనేమో!! ఇపుడు కొన్ని కంపెనీలు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. మోడళ్లనే కాక... బ్రాండ్లను కూడా పెంచుకుంటున్నాయి. అంటే ఒకే కంపెనీ వివిధ రకాల బ్రాండ్లతో మార్కెట్లోకి ఫోన్లను విడుదల చేస్తోందన్న మాట. ఈ నయా ట్రెండ్‌పై ప్రత్యేక కథనమిది...
సబ్ బ్రాండ్ల హవా...
మైక్రోమ్యాక్స్ మనందరికీ సుపరిచితమే. దేశీ మార్కెట్లోకి తూఫాన్‌లా దూసుకొచ్చిన ఈ కంపెనీ విలువ ఇప్పటికే బాగా పెరిగింది. ఇప్పటిదాకా మైక్రోమ్యాక్స్ పేరిట వివిధ మోడళ్లను తెచ్చిన ఈ సంస్థ ఇపుడు ‘యూ’ బ్రాండ్‌తోనూ ఫోన్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే యూ-యురేకాను విడుదల చేసి... తాజాగా యూ-యుఫోరియాను కూడా మార్కెట్లోకి తెచ్చింది. ఇక అంతర్జాతీయ దిగ్గజం హువాయి... ‘హానర్’ పేరిట మరో బ్రాండ్‌ను తెరపైకి తెచ్చి, పలు మొబైల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది కూడా. ఇక చైనా దిగ్గజాలు ఒప్పో, జెడ్‌టీఈ, కూల్‌ప్యాడ్‌తో పాటు లావా కూడా సబ్‌బ్రాండ్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది.
నుబియా పేరిట జెడ్‌టీఈ, డాజెన్ పేరిట కూల్‌ప్యాడ్ తమ సబ్ బ్రాండ్లను మార్కెట్లోకి తెచ్చాయి. ఒప్పో పేరెంట్ కంపెనీ బీబీకే ఎలక్ట్రానిక్స్... తాజాగా వివో బ్రాండ్‌తో కూడా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది. ఇంకా విశేషమేంటంటే జోలో పేరిట లావా మొబైల్స్ సబ్ బ్రాండ్‌ను తేగా... ఈ నెల 10న జోలో మరో సబ్‌బ్రాండ్ ‘బ్లాక్’ను ఆవిష్కరించేందుకు సిద్ధమయింది. డాజెన్ మినహా మిగిలిన సబ్ బ్రాండ్ మొబైల్స్‌పై ఎక్కడా ప్రధాన బ్రాండ్ పేరు కనిపించదు. హానర్ 2014లో ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల యూనిట్లను విక్రయించింది. రెండింతల అమ్మకాలను 2015లో నమోదు చేయాలన్నది కంపెనీ లక్ష్యం. ఇక జెడ్‌టీఈకి చెందిన నుబియా గతేడాది వివిధ దేశాల్లో 50 లక్షల యూనిట్లు అమ్మింది. 2015లో కోటి యూనిట్ల లక్ష్యం పెట్టుకుంది. ఈ ఏడాది కూల్‌ప్యాడ్ ఇప్పటిదాకా 50 లక్షల పైచిలుకు డాజెన్ ఫోన్లను విక్రయించింది.
దేశీ బ్రాండ్లే ఎక్కువ...: గతేడాది మార్కెట్లోకి వచ్చిన 95 బ్రాండ్లలో విదేశీవి 31కాగా మిగిలిన 64 దేశీయ బ్రాండ్లే. పెపైచ్చు ఇవి విడుదల చేసిన 1135 ఫోన్లలో స్మార్ట్‌ఫోన్లే ఎక్కువ. వీటిలో 691 స్మార్ట్‌ఫోన్లుండగా మిగిలినవి ఫీచర్ ఫోన్లు. ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న భారత్... 2017 నాటికి అమెరికా మార్కెట్‌ను మించిపోయి 2వ స్థానానికి చేరుతుందని పరిశోధన సంస్థ స్ట్రాటజీ అనలిటిక్స్ తెలియజేసింది. 2015లో దేశంలో 11.8 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. ఇంతటి అవకాశాలు ఉన్నాయి కాబట్టే భారత్‌లో సబ్ బ్రాండ్లు సైతం అడుగు పెడుతున్నాయి.
ఆన్‌లైన్‌తో ప్రారంభమై..
హువాయి, జెడ్‌టీఈ, కూల్‌ప్యాడ్, మైక్రోమ్యాక్స్, జోలో ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ మోడళ్లను విక్రయిస్తున్నాయి. అయితే వీటి సబ్ బ్రాండ్లు మాత్రం షియోమీ, మోటరోలా మాదిరిగా ఆన్‌లైన్ ద్వారానే రంగ ప్రవేశం చేస్తున్నాయి. వ్యాపారావకాశాల దృష్ట్యా ఇటీవలే హానర్ ఆఫ్‌లైన్‌లోకి ప్రవేశించింది. బ్లాక్ ఈ నెల ఆవిష్కరించనున్న మోడల్‌ను వొడాఫోన్ ఔట్‌లెట్లలో ప్రదర్శనకు పెట్టింది. ఆన్‌లైన్‌కే పరిమితమైతే పంపిణీ, సరఫరా వ్యవస్థను పూర్తిగా నియంత్రించుకునేందుకు కంపెనీలకు వెసులుబాటు ఉంటుందని సైబర్ మీడియా రీసర్చ్ విశ్లేషకుడు ఫైజల్ కవూసా తెలిపారు. అంతేగాక మార్జిన్లు బాగుంటాయని, మోడళ్లను భిన్నంగా అందించేందుకు వీలవుతుందని చెప్పారు. కోట్ల మంది పట్టణ కస్టమర్లను లక్ష్యంగా చేసుకోవచ్చని కౌంటర్ పాయింట్ టెక్నాలజీ అనలిస్ట్ తరుణ్ పాఠక్ చెప్పారు. ఆవిష్కరించిన తొలి రోజు నుంచే దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు చేరుకోవచ్చన్నారు.