స్మార్ట్ఫోన్ రారాజులకు చైనీస్ బ్రాండ్ల దెబ్బ
స్మార్ట్ఫోన్ రారాజులకు చైనీస్ బ్రాండ్ల దెబ్బ
Published Wed, Oct 19 2016 10:24 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
భారత్లో స్మార్ట్ఫోన్ రారాజులు శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్ల మార్కెట్ షేరుకు దెబ్బకొడుతూ చైనీస్ కంపెనీలు దూసుకెళ్లాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో చైనీస్ స్మార్ట్ఫోన్ ప్లేయర్లు లెనోవో, షియోమి, వివో, ఓపోలు మార్కెట్లో భారీ అమ్మకాలు చేపట్టి, టాప్-10 స్థానాల్లో నిలిచాయని హాంగ్కాంగ్ ఆధారిత మార్కెట్ రీసెర్చర్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. గత క్వార్టర్లో 27శాతమున్న చైనీస్ బ్రాండ్ల మార్కెట్ షేరు ఈ క్వార్టర్లో 32శాతానికి ఎగిసిందని పేర్కొంది. అదేవిధంగా సెప్టెంబర్లో లాంచ్ చేసిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సర్వీసులతో ఆ ఇండస్ట్రీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఎల్వైఎఫ్ మార్కెట్లో నెంబర్ 4 స్థానానికి ఎగబాకినట్టు కౌంటర్ పాయింట్ వెల్లడించింది.
మరోవైపు పండుగల సీజన్ నేపథ్యంలో భారత్లో స్మార్ట్ఫోన్ షిప్మెంట్లూ భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్మార్ట్ఫోన్ షిప్మెంట్స్ 35 మిలియన్ యూనిట్లు రికార్డు మార్కును తాకినట్టు వెల్లడైంది. అంటే ఈ షిప్మెంట్లు దాదాపు 21శాతం పెరిగాయి. ఇదంతా పండుగ సీజన్ కాలంలో రీటైలర్ల నుంచి వస్తున్న డిమాండేనని కౌంటర్ పాయింట్ వివరించింది. మొట్టమొదటిసారి భారత్లో 30 మిలియన్ స్మార్ట్ఫోన్లు విక్రయాలు జరిగాయని కౌంటర్పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ నీల్ షా తెలిపారు. ఈ ఏడాది ప్రథమార్థంలో మందకొండిగా సాగిన స్మార్ట్ఫోన్ అమ్మకాలు, ద్వితీయార్థంలో పండుగ సీజన్లో భారీగా పుంజుకుంటున్నాయని ఆనందం వ్యక్తంచేశారు. దీపావళి ఈ అమ్మకాలను మరింత పెంచుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ఉచితమైన వాయిస్, డేటా వంటి సంచలనమైన ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చిన జియో సర్వీసులతో, ఎల్వైఫ్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ మార్కెట్ షేరు 6.7శాతానికి ఎగిసినట్టు కౌంటర్పాయింట్ తెలిపింది. మార్కెట్ రారాజులు శాంసంగ్, మైక్రోమ్యాక్స్లు తీవ్ర ఇరకాటంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది. దీంతో ఆ సంస్థలు మార్కెట్ షేరు సెప్టెంబర్ క్వార్టర్లో 21.6శాతం, 9.8 శాతం కోల్పోయినట్టు వెల్లడించింది. అయినప్పటికీ ఈ రెండు టాప్ స్థానాల్లోనే ఉన్నాయి. రెడ్మి నోట్3 మోడల్ అద్భుతమైన ప్రదర్శనతో షియోమి నంబర్ 6 స్థానంలోకి వచ్చింది. వివో, ఓపోలు 7, 8 స్థానాలను దక్కించుకున్నాయి.
Advertisement