మూగబోయిన నొలారిటీ! | Mobily shares to stay suspended as irregularities are investigated | Sakshi
Sakshi News home page

మూగబోయిన నొలారిటీ!

Published Tue, Jun 28 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

మూగబోయిన నొలారిటీ!

మూగబోయిన నొలారిటీ!

పెద్ద పెద్ద సంస్థలన్నిటికీ నిలిచిపోయిన సేవలు
ఆకస్మికంగా క్లౌడ్ సేవలను నిలిపేసిన టెలికం శాఖ
అనుమతి లేని ఫీచర్లిస్తుందనే కారణంతోనే  చర్య?
మాకు అన్ని అనుమతులూ ఉన్నాయంటున్న
కంపెనీ సీఈఓ అంబరీష్ గుప్తా
4 రోజుల నిలిపివేతతో 15% వ్యాపారం దెబ్బతిన్నట్లు వెల్లడి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అనుమతి లేని ఫీచర్లను అందిస్తున్న కారణంతో ‘టెక్నాలజీ-టెలికం’ సేవలందించే నొలారిటీ సంస్థ సేవల్ని నిలిపివేయాలని కేంద్ర టెలికం శాఖ టెలికం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. తక్కువ ధరకు క్లౌడ్ అనుమతులను తీసుకొని... కస్టమర్ల నుంచి భారీ మొత్తాన్ని చార్జీల రూపంలో వసూలు చేస్తూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ సంస్థ కమ్యూనికేషన్ సేవలను కూడా అందిస్తోందని టెలికం శాఖ పేర్కొంది. ఈ విషయంపై ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధి నొలారిటీ యాజమాన్యాన్ని ఫోన్‌లో సంప్రదించగా.. ‘‘మేమేమీ అనుమతి లేని ఫీచర్లను అందించటం లేదు.

విస్తరణలో భాగంగా సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం’’ అని నొలారిటీ సీఈవో అంబరీష్ గుప్తా చెప్పారు. అసలెలాంటి ముందస్తు నోటీసులు, సంప్రదింపులు జరపకుండానే అకస్మాత్తుగా సేవలను రద్దు చేశారని ఆరోపించారు. నొలారిటీకి సంబంధించిన లెసైన్స్‌లో వర్చువల్ నంబర్, క్లిక్ టు కాల్, సూపర్ రిసెప్షనిస్ట్, కాల్ ఫార్వార్డింగ్ వంటి ఫీచర్లు లేవనేది టెలికం విభాగం మాట. ఈ విషయంపై అంబరీష్ స్పందిస్తూ.. ‘‘మేం పదేళ్ళ కిందటే ఆడియో టెక్స్ట, టెలి మార్కెటింగ్, ఓఎఫ్‌పీ మూడు రకాల లెసైన్స్‌లను  తీసుకున్నాం. వీటికి కేంద్ర టెలికం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ అనుమతులిచ్చింది’’ అని చెప్పారు.

ఇతర బహుళజాతి కంపెనీలు విక్రయించే సాధారణ ఉపకరణాలతో పోలిస్తే నొలారిటీ కమ్యూనికేషన్ వ్యవస్థకయ్యే  ఖర్చు అందులో పదో వంతు కంటే తక్కువే ఉంటుందన్నారు. సేవలను పునరుద్ధరించాలంటూ టెలికం వివాదాల పరిష్కార, అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను (టీడీ శాట్) సంప్రదించామని.. టెలికం విభాగం స్పందించి 14 రోజుల స్టే ఆర్డర్ ఇచ్చిందని గుప్తా వివరించారు. ‘‘కానీ సేవల్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదు. ఈ రోజుకు కూడా ఢిల్లీ, ముంబై వంటి కొన్ని చోట్ల మా కస్టమర్ల ఫోన్లు పనిచేయటం లేదు’’ అని తెలియజేశారు.

 15 శాతం వ్యాపార నష్టం..
పల్లవ్ పాండే, అంబరీష్ గుప్తాలు రూ.20 లక్షల పెట్టుబడితో 2009లో సింగపూర్ ప్రధాన కేంద్రంగా నొలారిటీని ప్రారంభించారు. ఈ-కామర్స్, రియల్ ఎస్టేట్, ట్రావెల్, ఎడ్యుకేషన్ ఇలా సుమారు 20 రంగాలకు చెందిన 65 దేశాల్లోని 12 వేలకు పైగా కంపెనీలు నొలారిటీ క్లౌడ్ సేవలను వినియోగించుకుంటున్నాయి. ఫార్చూన్ 500 కంపెనీల్లో 100కు పైగా కంపెనీలు నొలారిటీ కస్టమర్లే. ఇండియాతో పాటు ఆఫ్రికా, దుబాయ్, సింగపూర్, ఫిలిిప్పీన్స్, టర్కీ, మలేసియా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. హిందుస్తాన్ యూనిలీవర్స్, లాక్మే, మహిం ద్రా హాలీడేస్, ఎల్‌అండ్‌టీ, ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్, ట్వీటర్, కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ వంటివీ దీని క్లయింట్లే. అయితే ప్రస్తుతం నొలారిటీకి ఉన్న 12 వేల కస్టమర్ల ఫోన్లు మూగబోతున్నాయి. ‘ఐదు నిమిషాలు మా సేవలు నిలిపేస్తేనే కోట్లలో వ్యాపార నష్టం వాటిల్లుతుంది. అలాంటిది 96 గంటలుగా మా సేవలను నిలిపేశారు. మొత్తం వ్యాపారంలో 15% వరకూ నష్టపోతున్నాం’’ అని అంబరీష్ వివరించారు.

 ఫండింగ్.. కొనుగోళ్లు..
నొలారిటీ 2012లో సెకోయా క్యాపిటల్ నుంచి 6.6 మిలియన్ డాలర్లు, 2014 జూలైలో మేఫీల్డ్ నుంచి 15 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఇటీవలే ఢిల్లీ కేంద్రంగా పనిచేసే కస్టమర్ ఎంగేజ్‌మెంట్ స్టార్టప్ స్మార్ట్‌వర్డ్స్ సర్వీస్‌ను నొలారిటీ కొనుగోలు చేసింది. గతంలో ఢిల్లీ కేంద్రంగా పనిచేసే క్లౌడ్ టెలిఫోనీ స్టార్టప్ యూనీకాం టెక్‌ల్యాబ్స్‌ను కూడా ఈ సంస్థ టేకోవర్ చేసుకుంది. సింగపూర్‌తో పాటు దేశంలో గుర్గావ్, ముంబై, బెంగళూర్లలో నొలారిటీకి కార్యాలయాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement