సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకం కింద చిన్న విమానాశ్రయాలను అంతర్జాతీయ గమ్యస్ధానాలకు అనుసంధించాలని యోచిస్తోంది. ఈ పథకం కింద అంతర్జాతీయ గమ్యస్ధానాలకు రూ. 2500 కంటే తక్కువ చార్జీలతోనే చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దేశ ప్రజల్లో ఎక్కువ మందికి విమానాయానం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం ద్వారా చిన్న నగరాలనూ దేశంలోని పలు ప్రధాన నగరాలకు కనెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ రూట్లనూ సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఉడాన్ మూడవ దశలో ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పథకం కింద అసోంలోని విమానాశ్రయాలు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, నేపాల్‌లోని ఖట్మాండులతో కనెక్ట్ కానున్నాయి. ఇదే తరహాలో బిహార్ ఎయిర్‌పోర్ట్‌లను నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల్లోని ఎయిర్‌పోర్ట్‌లకు నేరుగా అనుసంధానించనున్నారు.
అసోం ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సమ్మతించగా, స్పైస్‌జెట్ సహా పలు విమానయాన సంస్థలు బ్యాంకాక్ వంటి ప్రముఖ గమ్యస్ధానాలకు విమాన సర్వీసులను చేపట్టేందుకు ఆసక్తి కనబరిచాయి. ప్రభుత్వం తన ప్రణాళికలతో ముందుకు వెళితే త్వరలోనే రూ. 2500తో అంతర్జాతీయ విమాన టికెట్లను ఆఫర్ చేస్తూ పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటన చేస్తుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉడాన్ మూడవ దశకు ఇటీవల ప్రభుత్వం బిడ్లు ఆహ్వానించగా 111 రూట్ల కోసం 15 ఎయిర్‌లైన్ల నుంచి బిడ్లను పొందింది.
Comments
Please login to add a commentAdd a comment