న్యూఢిల్లీ: దేశ సౌర్వభౌమ రేటింగ్‌ను పెంచుతూ మూడీస్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర సర్కారు స్వాగతించింది. ఆలస్యంగా దక్కిన గుర్తింపుగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీన్ని అభివర్ణించారు. ‘‘మూడీస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి గత కొన్నేళ్లుగా తీసుకున్న భారీ ఆర్థిక, సంస్థాగత సంస్కరణలను ఆలస్యంగా గుర్తించినట్టు మేం భావిస్తున్నాం’’ అని జైట్లీ శుక్రవారమిక్కడ మీడియాతో చెప్పారు.
జీఎస్టీ, పటిష్టమైన మానిటరీ పాలసీ వ్యవస్థ ఏర్పాటు, ప్రభుత్వరంగ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్, డీమోనిటైజేషన్, ఆధార్ అనుసంధానం వంటి వాటిని జైట్లీ ఉదహరించారు. గ్రామాల్లో, మౌలిక సదుపాయాలపై అధిక నిధులు వెచ్చించే దిశగా సంస్కరణల అజెండా కొనసాగుతుందని స్పష్టం చేశారు. మధ్య కాలానికి ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడి ఉండాలన్న విధానాన్ని కొనసాగిస్తామన్నారు. 2013–14లో ద్రవ్యలోటు 4.5 శాతంకాగా... 2016–17లో అది 3.5 శాతానికి తగ్గడాన్ని తాజా రేటింగ్ ప్రతిఫలిస్తుందని పేర్కొన్నారు.
‘‘ఇది పూర్తిగా ప్రోత్సాహాన్నిచ్చేది. సంస్కరణలకు అంతర్జాతీయంగా దక్కిన గుర్తింపు. ఇప్పటి వరకు మేం సాధించినదాన్ని కొనసాగించాలన్న ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళుతుంది’’అని జైట్లీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే విదేశీ పెట్టుబడుల రాక సానుకూలంగా ఉండగా, రేటింగ్ మెరుగుపడడంతో అవి కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీలో పన్ను రేట్ల స్థిరీకరణ కొనసాగుతుందని చెప్పారు.
దేశ ప్రగతికి గుర్తింపు: మూడిస్ రేటింగ్ పెంపు దేశంలో మెరుగైన పరిపాలన, నిర్ణయాల్లో పారదర్శకత, పెట్టుబడిదారీ అనుకూల విధానాలకు లభించిన గుర్తింపు అని ఐటీ, న్యాయ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభివర్ణించారు. ‘‘ఇది స్వాగతించతగిన పరిణామం. కానీ చాలా ఆలస్యమయింది. జీఎస్టీ, దివాలా చట్టం తదితర సంస్కరణలకు లభించిన గుర్తింపు. ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధి, పెట్టుబడుల పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తుంది’’ అని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment