ముంబై: చౌక గృహ నిర్మాణాలు, వీటికి రుణాలు సంబంధిత అంశాలకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో... ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్, ఆ సంస్థ దేశీయ అనుబంధ సంస్థ ఇక్రాలు తాజాగా ఈ ధోరణికి ‘రెడ్ ఫ్లాగ్’ ఊపాయి. చౌక గృహ రుణాలే బ్యాంకులకు తదుపరి ముప్పుగా వాటిల్లే అవకాశం ఉందని మూడీస్–ఇక్రా తాజా నివేదిక అంచనా వేసింది. ఈ విభాగంలో కొన్ని ప్రతికూల అంశాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని, ఇవే అంశాలు 2018లోనూ కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.
నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే...
♦ చౌక గృహ నిర్మాణ రుణ మంజూరీలో నెలకొన్న పోటీ– రుణ ప్రమాణాలు తగ్గిపోవడానికి కారణమవుతోంది. ఇక స్వయం ఉపాధిలో ఉన్న వారికి చౌక గృహ రుణ సదుపాయం వల్ల బకాయిల పరిమాణం పెరిగే అవకాశం ఉంది.
♦ సాంప్రదాయక గృహ విభాగంలో రుణనాణ్యత స్థిరంగా కొనసాగేవీలుంది. అయితే చౌక గృహరుణ విభాగంలో మాత్రం ఇందుకు సంబంధించి కొంత ఆందోళన పరిస్థితి కొనసాగవచ్చని ఇక్రా హెడ్ (స్ట్రక్చర్డ్ ఫైనాన్సెస్) మిట్టల్ పేర్కొన్నారు.
♦ చౌక గృహ రుణ విభాగంలో స్థూల నిరర్థక ఆస్తులు 2017 సెప్టెంబర్ నాటికి 1.8 శాతానికి చేరాయి. సాంప్రదాయక గృహ రుణ విభాగంతో పోల్చిచూస్తే 90 రోజులు పైబడిన రుణ బకాయిల సగటు స్థాయి చౌక గృహ రుణాల విషయంలో దాదాపు ఏడు రెట్లు అధికంగా ఉంది.
♦ 2020 నాటికి అందరికీ గృహం లక్ష్యం నెరవేరాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయం, ఇందుకు సంబంధించి చౌక గృహ నిర్మాణ రంగంలో భారీ ప్రోత్సాహకాలు, దీని ప్రాధాన్యతా విభాగంగా బ్యాంకింగ్ పరిగణించడం, వడ్డీ రాయితీలు, ప్రత్యక్ష నగదు సబ్సిడీ వంటి అంశాలను నివేదిక ప్రస్తావిస్తూ, రుణ నాణ్య తాంశాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించింది.
♦ అయితే మొత్తంగా హౌసింగ్ రుణ విభాగం రిటైల్ రుణాలకు సంబంధించి అత్యుత్తమమైనదిగా కొనసాగుతోంది. రుణ హామీలు పటిష్టంగా ఉండడం, రుణం తీసుకునే వ్యక్తి సొంత ఆస్తిగా రుణ హామీ ఉండడం, ఆస్తి ధరల్లో భారీ తగ్గుదల లేకపోవడం, రుణానికి తగిన ఆస్తి విలువల వంటి అంశాలు ఇక్కడ ప్రస్తావనార్హం.
♦ ఇక 2017 జూలై ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), అంతక్రితం డీమోనిటైజేషన్ చిన్న తరహా పరిశ్రమలపై భారాన్ని మోపాయని ఇక్రా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రస్తోగీ పేర్కొన్నారు.
ఇకపై ‘చౌక గృహ’ రుణాల భారం!
Published Tue, Jan 9 2018 12:59 AM | Last Updated on Sat, Jan 13 2018 2:19 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment