సాక్షి, న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాదిరి దిగ్గజ బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు త్వరలోనే న్యూఇయర్ గిఫ్ట్‌ను ప్రకటించబోతున్నాయి. దిగ్గజ బ్యాంకుల మధ్య పోటీగా పెరుగబోతుండటంతో, రుణాలపై వడ్డీరేట్లు తగ్గించేందుకు బ్యాంకులు ప్లాన్ చేస్తున్నాయి. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి బ్యాంకుల అసెట్-లైబిలిటీ కమిటీలు త్వరలోనే సమావేశం కాబోతున్నాయని ఈ విషయం తెలిసిన ముగ్గురు వ్యక్తులు చెప్పారు. తక్కువ వడ్డీరేట్లు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న పాత కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చనుందని తెలుస్తోంది.
మార్కెట్ లీడరు ఎస్‌బీఐ నుంచి అన్ని బ్యాంకులు సంకేతంగా తీసుకున్నాయని, తమ కస్టమర్లకు ప్రయోజనాలను బదిలీ చేయనున్నామని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి చెప్పారు. ఇటీవలే గృహ రుణం తీసుకున్న కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెబుతూ.. ఎస్‌బీఐ తన బేస్ రేటును 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బేస్ రేటు ప్రస్తుతం 8.65 శాతానికి దిగివచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో కూడా ఎస్‌బీఐ 5 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే.
పాలసీ రేట్లలో తగ్గింపును ప్రస్తుతం బ్యాంకులు తమ కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయని ఎస్‌బీఐ ఎండీ పీకే గుప్తా తెలిపారు. ప్రత్యర్థులు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు బేస్ రేటు 8.85 శాతముండగా.. యాక్సిస్ బ్యాంకు రేటు 9 శాతం, బ్యాంకు ఆఫ్ బరోడా బేస్ రేటు 9.15 శాతం, పీఎన్‌బీ బేస్ రేటు 9.35 శాతం ఉన్నాయి. గత కొన్నేళ్ల క్రితం ప్రైమ్ లెండ్ రేట్లను అమలు చేయగా... ప్రస్తుతం మాత్రం బ్యాంకులు బేస్ రేట్లకు మారాయి. 2016లో మళ్లీ బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ను పాటించడం ప్రారంభించాయి. తాజాగా బేస్ రేట్లతో లింక్ అయిన రుణాలు కేవలం పాత కస్టమర్లకు మాత్రమే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment