ఎగుమతుల్లో ఎంపెడా రికార్డు స్థాయి వృద్ధి
సాక్షి, విశాఖపట్నం : సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) ఎగుమతుల్లో రికార్డు స్థాయి వృద్ధి సాధించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5,511.12 మిలియన్ అమెరికా డాలర్ల విలువైన మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసి ఈ ఆల్‌టైమ్ హై రికార్డును సొంతం చేసుకుంది. రూ.33,441.61 కోట్ల విలువైన 10,51,243 మెట్రిక్ టన్నుల మత్స్య సంపదను ఎగుమతి చేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే సరకు పరిమాణంలో 6.86 శాతం, రూపాయల్లో 10.69 శాతం వృద్ధిని సాధించ గలిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 9,83,756 టన్నులను ఎగుమతి చేయగా 2014-15లో 6.86 శాతం వృద్ధితో 10,51,243 టన్నులకు పెరిగింది.
అలాగే 2013-14లో ఎగుమతుల విలువ రూ.3,02,132.60 కోట్లుండగా, 2014-15లో రూ. 3,34,416 కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో సంభవించిన పరిణామాలతో ఈ వృద్ధి సాధ్యమయిందని ఎంపెడా గురువారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ ఎగుమతుల్లో రొయ్యలదే (34.01 శాతం) అగ్రభాగమని పేర్కొంది. మొత్తం 3,57,505 టన్నుల రొయ్యలను ఎగుమతి చేసింది. 2014-15లో ఆక్వా ఉత్పత్తుల పెరుగుదల (30.63 శాతం) కూడా గణనీయంగానే ఉందని వివరించింది. మొత్తం ఆక్వా ఉత్పత్తులు 4,34,558 టన్నుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచే 2,79,727 టన్నుల ఎగుమతి జరిగింది. 29.44 శాతం పెరుగుదలతో చేపలు రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో కటిల్‌ఫిష్ (20.09 శాతం) ఉంది.