
ముంబై : దేశ కార్పొరేట్ దిగ్గజం ముఖేశ్ అంబానీ ఏకైక కుమార్తె ఇషా అంబానీ వివాహం ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌తో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ డిసెంబర్‌లోనే వీరి పెళ్లి ఉంటుందని సన్నిహిత వర్గాల సమాచారం. దేశంలోనే అపర కుబేరుడిగా పేరున్న ముఖేశ్ అంబానీ కూతురి పెళ్లి కావడంతో.. ఇప్పుడు అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇషా అంబానీ ఏం చేస్తుంటారు? ఆమె ఎక్కడ చదివారు వంటి వివరాల కోసం నెటిజన్లు వెతుకుతున్నారు. ముఖ్యంగా ఆమె పేరిట ఎంత ఆస్తి ఉందని ఆరా తీస్తున్నారు.
ముఖేశ్, నీతా అంబానీలకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇషా, ఆకాశ్ కవలలు కాగా అనంత్ చిన్నవాడు. మార్చిలో ఆకాశ్ నిశ్చితార్థం శ్లోకా మెహతాతో జరిగిన విషయం తెలిసిందే. ఇక, ఇషా విషయానికొస్తే.. 1990లో జన్మించిన ఇషా.. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందారు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చేస్తున్నారు. 2008లో ఫోర్బ్స్ ప్రకటించిన యువ బిలియనీర్ల జాబితాలో ఇషా రెండో స్థానంలో నిలవడంతో.. అప్పటినుంచి ఆమె పేరు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. దేశీ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఆలోచన ఇషాదే. రిటైల్ రంగంలోనూ రిలయన్స్ సేవలను విస్తరించేందుకు ‘ఎజియో’ ప్రారంభించడంలో ఇషా కీలక భూమిక పోషించారు. 26 ఏళ్ల ఇషా ప్రస్తుతం ఆసియాలోనే శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో 12వ స్థానంలో ఉన్నారు.
ఇక, ఇషా నికర సంపద విలువ రూ. 4,710 కోట్లు అని 2008లో ఫోర్బ్స్ మ్యాగజీన్ వెల్లడించింది. అప్పటినుంచి అధికారికంగా ఇషా ఆస్తి వివరాలు ఏవీ బహిర్గతం కాలేదు. ఆ జాబితా విడుదలై పది సంవత్సరాలు గడుస్తుండటంతో.. మారిన మార్కెట్ విలువ ఆధారంగా ఆమె ఆస్తి మరింత భారీగా పెరిగి ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment