వారసుడొచ్చాడు!
న్యూఢిల్లీ: సరిగ్గా ముప్పై రెండేళ్ల క్రితం రిలయన్స్ సామ్రాజ్యంలో ధీరూభాయ్ అంబానీ కుమారుడు ముకేశ్ అంబానీ అడుగుపెట్టారు. ఇప్పుడు ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని కంపెనీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు చెందిన టెలికం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ త్వరలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఆకాశ్ దీనిలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం కావడం విశేషం.
దేశవ్యాప్తంగా వైర్‌లెస్ బ్రాండ్ బ్యాండ్(4జీ) స్పెక్ట్రంను దక్కించుకున్న రిలయన్స్ జియో... తాజాగా జరిగిన 2జీ వేలంలో అనేక సర్కిళ్లలో స్పెక్ట్రంను కొనుగోలు చేయడం తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... రిలయన్స్ జియో టెలికం సేవలకు సంబంధించి కీలకమైన మార్కెట్ వ్యూహాన్ని ఖరారు చేయడంలో ఆకాశ్ కూడా పాలుపంచుకున్నట్లు సమాచారం. ‘కంపెనీకి క్రమంతప్పకుండా ఆకాశ్ వస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార వ్యూహాల్లో కీలక పాత్ర పోషించే మనోజ్ మోడి, చైర్మన్ ముకేశ్‌తో సమీక్షా సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారు. రిలయన్స్ జియో గ్రూప్ ప్రెసిడెంట్ సందీప్ దాస్ తో సన్నిహితంగా పనిచేస్తున్నారు. అయితే, కంపెనీ దీనిపై బయటకు వివరాలను వెల్లడించకపోవడానికి ఆకాశ్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉండటం కారణం’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తండ్రి బాటలోనే...
1981లో ముకేశ్ అంబానీ 24 ఏళ్ల వయస్సులో ఆర్‌ఐఎల్‌లో చేరారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో భారత్‌లోనే అతిపెద్ద చమురు రిఫైనరీని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు రిలయన్స్ గ్రూప్ తొలిసారిగా టెలికం వెంచర్‌లోకి రావడంలో(విడిపోక ముందు) ముకేశ్ చొరవే ప్రధానకారణం. కాగా, ప్రస్తుతం ఆకాశ్ అంబానీ వయస్సు కూడా 22 ఏళ్లు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో అండర్ గ్యాడ్యుయేషన్ చేసిన ఆకాశ్ గతేడాది భారత్‌కు తిరిగొచ్చారు.
ముకేశ్‌కు ప్రీతిపాత్రమైన టెలికం రంగంలోనే, అందులోనూ సొంత కంపెనీలోనే తన తొలి కార్పొరేట్ ప్రస్థానాన్ని ప్రారంభిస్తుండటం విశేషం. కాగా, యేల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఆకాశ్ సోదరి ఇషా కూడా త్వరలోనే రిలయన్స్ ఫౌండేషన్‌లో చేరనున్నట్లు సమాచారం. గ్రూప్ నేతృత్వంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, హాస్పిటల్ వెంచర్‌లు దీని అధీనంలోనే ఉన్నాయి. కాగా, ముకేశ్ రెండో కుమారుడు అనంత్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు.