
సాక్షి, ముంబై: పీఎన్‌బీ స్కాంలో కీలక నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీ చుట్టు ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో ఎదురుదాడికి దిగాడు. చట్టంతో నిమిత్తం లేకుండా తన విధిరాతను అధికారులే నిర్ణయించేశారంటూ ఈడీకి పంపిన ఈ మెయిల్‌లో నీరవ్ వాపోయాడు. ఉద్దేశపూర్వకంగా ముందస్తు వ్యూహం ప్రకారమే తనపై దాడి జరుగుతోందని నీరవ్ ఆరోపించాడు. మెరుపు వేగంతో కదులుతున్న అధికారులు చర్యలే ఇందుకు నిదర్శనమన్నాడు. తన భవిష్యత్తును ముందుగానే నిర్ణయించినట్లుగా కనిపిస్తోందని మోదీ పేర్కొన్నాడు.
ఒకవైపు తన పాస్‌పోర్టును పాస్‌పోర్టు అధికారులు సస్పెండ్ చేశారు. మరోవైపు తనను విచారణకు హాజరు కావాల్సిందిగా దర్యప్తు సంస్థలు ఆదేశించాయి. ఇంతలో తన పాస్‌పోర్టు ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పమని కోరాను. ఇలా అడిగిన కేవలం కొన్ని నిమిష్లాలోనే.. తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, చట్టం గురించి ఏమాత్రం ఆలోచించకుండా చట్టవిరుద్ధంగా తన పాస్‌పోర్టును రద్దు చేశారన్నాడు. అయితే ఇప్పటికీ విదేశాల్లో వ్యాపార లావాదేవీల్లో తనమునకలై ఉన్న తాను సాధ్యమైనంత తొందరగా ఈ స్థితినుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నానని తన మెయిల్‌లో నీరవ్ మోదీ వివరించాడు.
మరోవైపు పీఎంఎల్‌ఎ ప్రత్యేక కోర్టు నీరవ్‌మోదీ, చోక్సీలకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇది ఇలా ఉంటే నీరవ్ మోదీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. ఆయనకు చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ సంస్థ అమెరికాలోని కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసిన పిటీషన్‌పై సానుకూలంగా స్పందించింది. శుక్రవారం దీన్ని విచారణను కోర్టు రుణదాతలు నీరవ్ దగ్గర నుంచి రుణాలను ఇప్పుడే వసూలు చేయొద్దని.. అతడి మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురావద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెండు పేజీల నివేదికను విడుదల చేసింది.