
ఐటీ ఉద్యోగులకు నైపుణ్యం పెరగాలి
ప్రపంచ ఐటీ రంగం అనూహ్య మార్పులకు లోనవుతోంది.
ఎన్‌ఐఐటీ సీఈవో రాహుల్ పట్వర్ధన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచ ఐటీ రంగం అనూహ్య మార్పులకు లోనవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న 39 లక్షల పైచిలుకు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు తప్పనిసరి అని ఎన్‌ఐఐటీ సీఈవో రాహుల్ పట్వర్ధన్ గురువారమిక్కడ మీడియాతో అన్నారు. వచ్చే ఐదేళ్లలో వీరంతా శిక్షణ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. బిగ్ డేటా, డేటా సైన్స్, వర్చువల్ రియాలిటీ, ఐవోటీ, రోబోటిక్స్ వంటి నూతన అంశాలన్నిటిలోనూ నైపుణ్యం ఉండాలని తెలిపారు. ‘ప్రస్తుత జనాభాలో 50 శాతం మంది 25 ఏళ్లలోపువారే. అంటే 67 కోట్ల మందికి రానున్న 20 ఏళ్లలో ఉద్యోగాలు అవసరమవుతాయి.
ఆరోగ్య రంగంలో వస్తున్న టెక్నాలజీ పుణ్యమాని మనిషి సగటు జీవన కాలం అధికమవుతోంది. ఈ లెక్కన పదవీ విరమణ వయసు పెరుగుతోంది. మరోవైపు ఐటీ రంగంలో ఉద్యోగాల కోత పడుతోంది. పరిశ్రమ అవసరానికి తగ్గట్టుగా మల్టీ టాస్క్ పనులు చేయగలిగే సత్తా ఉన్నవారికే భవిష్యత్తులో ఉద్యోగాలు ఉంటాయి’ అని వెల్లడించారు. ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్లు పెద్దగా ఉండకపోవచ్చని అన్నారు. ఐటీ కంపెనీల ఉద్యోగులకు ఎన్‌ఐఐటీ ద్వారా శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. డిజి నెక్టŠస్ పేరుతో 12 రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు.