పెదతాడేపల్లిలో ఏపీ నిట్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడుతున్న రెసిడెంట్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసరావు
తాడేపల్లిగూడెం రూరల్ : జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్)లో ర్యాగింగ్‌కు పాల్పడి క్రమశిక్షణ చర్యలకు గురైన బాధిత విద్యార్థులు, సహచర విద్యార్థులు సంయుక్తంగా మంగళవారం పెదతాడేపల్లిలోని ఏపీ నిట్ తాత్కాలిక ప్రాంగణంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా 2వ తేదీన జరిగిన సంఘటన ర్యాగింగ్ కాదంటూ... ర్యాగింగ్‌కు గురైనట్టు పేర్కొంటున్న విద్యార్థి ఫిర్యాదు ఉపసంహరించుకున్నా బాధిత విద్యార్థులను డిబార్ చేయడం, హాస్టల్‌లో ఉండనివ్వకపోవడం వంటి సంఘటనలు, ర్యాగింగ్ చట్టం కింద విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం వెళ్లడంతో ఈ ఆందోళన చేపట్టారు. బాధిత విద్యార్థులకు ద్వితీయ, తృతీయ సంవత్సరం సహచర విద్యార్థులు మద్దతు పలకడంతో సుమారు 300 మంది వరకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ఉదయం 9.45 గంటల నుంచి తరగతులను బహిష్కరించి నిట్ పరిపాలనా భవనం ఎదుట ఆందోళనకు దిగారు. సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది.
విద్యార్థులతో చర్చలు
నిట్ రెసిడెంట్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఇతర అధ్యాపక సిబ్బంది విద్యార్థులను సముదాయించే ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో తాడేపల్లిగూడెం రూరల్ ఎస్సై బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిట్ అధికారులు మరోసారి విద్యార్థులతో భేటీ అయ్యారు. విద్యార్థులు తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా అందజేశారు. క్రమశిక్షణ చర్యల్లో మదింపు, విద్యార్థులకు న్యాయం చేసేలా వరంగల్ నిట్ ఉన్నతాధికారులతో మాట్లాడతామని భరోసా ఇవ్వడంతో పాటు ప్రత్యక్షంగా వారి విజ్ఞప్తిని ఢిల్లీలోని ఎంహెచ్‌ఆర్‌డీకి ఈ మేరకు మెయిల్ చేశారు. వి ద్యార్థులు ఆందోళన విరమించారు. ఒకానొక సమయంలో సమస్య పరి ష్కారం కాని పక్షంలో ఆత్మహత్యలకు సైతం సిద్ధమంటూ విద్యార్థులు హెచ్చరించారు. దీంతో ఓ సమయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఎట్టకేలకు చర్చలు ఫలించడంతో నిట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment