వ్యాపారం గాడిలో పడింది | Narendra Modi About Business activities in India After Lockdown | Sakshi
Sakshi News home page

వ్యాపారం గాడిలో పడింది

Published Fri, Jun 19 2020 9:48 AM | Last Updated on Fri, Jun 19 2020 9:48 AM

Narendra Modi About Business activities in India After Lockdown - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడిపరమైన లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో దేశీయంగా వ్యాపార కార్యకలాపాలు వేగంగా మళ్లీ సాధారణ స్థాయికి తిరిగి వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కరోనా వైరస్‌ మహమ్మారి ముందు స్థాయికి వినియోగం, డిమాండ్‌ మెరుగుపడుతోందని ఆయన తెలిపారు. మే ఆఖరు వారం, జూన్‌ తొలి వారంలో నమోదైన విద్యుత్, ఇంధనం ఇతరత్రా ఉత్పత్తుల వినియోగానికి సంబంధించిన డేటా ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వాణిజ్య మైనింగ్‌ కోసం బొగ్గు బ్లాకుల వర్చువల్‌ వేలం ప్రక్రియను గురువారం ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ‘తాజా గణాంకాలన్నీ కూడా భారత ఎకానమీ వేగంగా రికవర్‌ అయ్యేందుకు సన్నద్ధమవుతున్న సంకేతాలుగా కనిపిస్తున్నాయి. భారత్‌ గతంలో ఎన్నో పెద్ద సంక్షోభాల నుంచి బైటపడింది. దీన్నుంచి కూడా బైటపడుతుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  గ్రామీణ ఎకానమీ కూడా వేగంగా కోలుకుం టోందని ప్రధాని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఖరీఫ్‌ పంట విస్తీర్ణం 13 శాతం పెరిగిందని, ఈ ఏడాది గోధుమల ఉత్పత్తి, కొనుగోలు కూడా భారీగా పెరిగిందని ఆయన తెలిపారు.  

స్వయంసమృద్ధి సాధిస్తాం..
భార™Œ  కచ్చితంగా వృద్ధి, స్వయంసమృద్ధి సాధిం^è గలదని ప్రధాని తెలిపారు. ‘కొన్ని వారాల క్రితం దాకా మనం ఎన్‌–95 ఫేస్‌ మాస్కులు, కరోనా టెస్టింగ్‌ కిట్లు, వ్యక్తిగత సంరక్షణ సాధనాలు, వెంటిలేటర్లను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మేకిన్‌ ఇండియా ద్వారా దేశీయంగా డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. త్వరలోనే కీలకమైన వైద్య ఉత్పత్తుల ఎగుమతిదారులుగా కూడా మారగలం‘ అని ఆయన పేర్కొన్నారు. భారత చరిత్రను, రాతను తిరగరాయడానికి కార్పొరేట్‌ రంగానికి ఒక అవకాశం దొరికిందని, దీన్ని వదులుకోవద్దని ప్రధాని సూచించారు. భారత్‌ను పురోగతి వైపు నడిపించాలని, స్వయంసమృద్ధి సాధించేలా తోడ్పడాలని పేర్కొన్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా మిగిలే వేల కోట్ల రూపాయలను పేదల సంక్షేమానికి వినియోగించవచ్చన్నారు. మనం ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న వాటినే రేపు భారీగా ఎగుమతి చేసే స్థాయికి చేరాలని, సంక్షోభాన్ని మనం అవకాశంగా మల్చుకోవాలని సూచించారు. 

బొగ్గు ఎగుమతి దేశంగా ఎదగాలి ..
అపార నిల్వలున్న భారత్‌ త్వరలో ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు ఎగుమతి దేశంగా ఎదగాలని   మోదీ ఆకాంక్షించారు. బొగ్గు వాణిజ్య మైనింగ్‌ను అనుమతించడం ఆ దిశగా వేసిన అడుగేనని  చెప్పారు. 41 బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను మోదీ ప్రారంభించారు. దీనితో వచ్చే 5–7 ఏళ్లలో దేశంలోకి రూ.33,000 కోట్ల పెట్టుబడులు రాగలవని చెప్పారు. బొగ్గు నిల్వల్లో నాలుగో స్థానంలో ఉన్న భారత్‌.. ఎగుమతుల సంగతి అటుంచి.. అత్యధికంగా బొగ్గు దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో రెండో స్థానంలో ఉంటోం దన్నారు. ఈ పరిస్థితి మారుతుందని, భారత్‌ అతి పెద్ద బొగ్గు ఎగుమతి దేశంగా మారగలదని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాకుల వేలంతో రాష్ట్రాలకూ భారీగా ఆదాయం వస్తుందని, ఉపాధి కల్పనకు తోడ్పడుతుందని ఆయన చెప్పారు.

ఎకానమీకి ఊతం..
బొగ్గు రంగంలో ప్రైవేట్‌ సంస్థలను అనుమతించడం వల్ల ఉద్యోగాల కల్పన జరుగుతుంది, బొగ్గు దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని పరిశ్రమల సమాఖ్యలు పేర్కొన్నాయి. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు, 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగేందుకు మరింత ఊతం లభించగలదని తెలిపాయి. ‘దేశ సహజ వనరులను వెలికి తీసే దిశగా ఇది కీలక సంస్కరణ‘ అని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీతా రెడ్డి తెలిపారు. బొగ్గు రంగంలో కొత్త పెట్టుబడులు, సాంకేతికతను తెచ్చేందుకు ఇది దోహదపడగలదని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు. ఈ సంస్కరణలతో దేశ జీడీపీలో మైనింగ్‌ రంగం వాటా 5 శాతానికి పెరగగలదని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందని, వెనుకబడిన ప్రాంతాల్లోని వారికి ఉపాధి లభించగలదని వేదాంత చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement