మోడీ వస్తే కొలువులే.. కొలువులు! | Narendra Modi-led government likely to boost job market in India: Experts | Sakshi
Sakshi News home page

మోడీ వస్తే కొలువులే.. కొలువులు!

Published Thu, May 15 2014 1:00 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

మోడీ వస్తే కొలువులే.. కొలువులు! - Sakshi

మోడీ వస్తే కొలువులే.. కొలువులు!

న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ నరేంద్ర మోడీకి జై కొట్టడంతో జాబ్ మార్కెట్ జోరుగా ఉండనున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నరేంద్ర మోడీ ఆర్థిక వ్యవస్థను ముఖ్యంగా తయారీ రంగాన్ని పునరుజ్జీవింపజేస్తారని వారంటున్నారు. యూనిసవివిధ హెచ్‌ఆర్ సంస్థలు-యూనిసన్ ఇంటర్నేషనల్, కెరీర్ బిల్డర్ ఇండియా, ర్యాండ్‌స్టాడ్ ఇండియా, మేరాజాబ్ ఇండియా తదితర సంస్థలు  వెల్లడించిన అభిప్రాయాల ప్రకారం...,
   మోడీ పాలనలో జాబ్ మార్కెట్ కనీసం 30 శాతం వృద్ధిని సాధిస్తుందని యూనిసన్ ఇంటర్నేషనల్ అంచనా వేస్తోంది. కోటిన్నర నుంచి రెండు కోట్ల ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. ఒకవేళ బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తే, జాబ్ మార్కెట్ మరింత జోరుగా ఉంటుందని వివరించింది.

   మోడీ కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రస్తుతమున్న ఆర్థిక వృద్ధి రేటు ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని కెరీర్ బిల్డర్ ఇండియా అంచనా వేస్తోంది. తర్వాతి ఒకటి, రెండేళ్లలో ఆర్థిక వృద్ధి 5.5 శాతం నుంచి 6 శాతానికి పెరిగే అవకాశాలుంటాయని, దీంతో 20 శాతం ఉద్యోగాలు కొత్తగా వస్తాయని వివరించింది.

   నరేంద్ర మోడీ తయారీ రంగంపై ప్రధానంగా దృష్టి పెడతారని, ఫలితంగా ఈ రంగంలో ఉద్యోగాలు బాగా వస్తాయని యూనిసన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. అంతేకాకుండా ఐటీ, మౌలిక, బ్యాంకింగ్, టూరిజమ్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో కూడా మరిన్ని ఉద్యోగాలు వస్తాయని వివరించింది. తయారీ రంగానికి సంబంధించి అనుమతులు త్వరగా ఇవ్వడం, ఉత్తమ మౌలిక సదుపాయాలు, సులభంగా భూమి లభ్యమయ్యేలా చూడడం తదితర అంశాలకు నరేంద్ర మోడి ప్రాధాన్యత ఇస్తారని పేర్కొంది.

   ప్రతీ ఏడాది 1.2 కోట్ల మంది యువజనులకు ఉద్యోగాలు చూపించాల్సిన అవసరముందని ర్యాండ్‌స్టాడ్ ఇండియా పేర్కొంది. వీరికి ఉద్యోగాలు కల్పించాలన్నా, ఇతర రంగాల వృద్ధి కోసమన్నా తయారీ, మౌలిక రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని వివరించింది. ఈ రెండు రంగాల్లో రానున్న పదేళ్లలో 3-4 కోట్ల కొత్త ఉద్యోగాలు రానున్నాయని పేర్కొంది.

కొత్త ఉద్యోగాల సృష్టిపై తయారీ రంగం ప్రభావం అధికంగా ఉంటుందని, ఈ రంగానికి సంబంధించి విధానాల్లో స్థిరత్వం ఉంటే ఈ రంగంలోకి పెట్టుబడులు పెరుగుతాయని, ఇన్వెస్టర్లను, వ్యాపార వేత్తలను ఈ రంగం ఆకర్షిస్తుందని మేరాజాబ్ ఇండియా పేర్కొంది.

 బహుళ బ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల అనుమతి నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేయదని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. అలా చేస్తే ఇన్వెస్ట్‌మెంట్ సెంటిమెంట్ దెబ్బతిని రిటైల్, ఇ కామర్స్, తదితర రంగాల్లో  ఉద్యోగావకాశాలకు భారీ స్థాయిలో గండి పడుతుందని కెరీర్ బిల్డర్ ఇండియా అభిప్రాయం వ్యక్తం చేసింది.

 వ్యాపార విశ్వాసాన్ని పాదుకొల్పాలంటే స్థిరత్వం ముఖ్యమని, ఎఫ్‌డీఐ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే, ఈ రంగంలో పెట్టుబడులు, ఉద్యోగావకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని మేరాజాబ్ ఇండియా పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement