
ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ మహిళలకు పెద్ద పీట వేయనుంది. మహిళా ఉద్యోగులకు సరైన ప్రాతినిధ్యం కల్పించే దిశగా చర్యలు ఆరంభించింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో వచ్చే నాలుగైదేళ్ల కాలంలో పావు శాతం మహిళలే ఉంటారన్న ఆశాభావం వ్యక్తం చేసింది. దేశంలో మొట్టమొదటిది అయిన పుణెలోని టాటా మోటార్స్ ప్లాంట్‌లో 1974లోనే జేఆర్‌డీ టాటా మహిళా ఇంజనీర్‌గా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తిని నియమించుకున్న విషయాన్ని గుర్తు చేసింది. ‘‘గడిచిన నాలుగైదేళ్ల కాలంలో మహిళా ఉద్యోగులను గణనీయంగా పెంచుకున్నాం. వచ్చే నాలుగైదేళ్ల కాలంలో మహిళా ఉద్యోగుల సంఖ్య 20–25 శాతానికి పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్నాం’’ అని టాటా మోటార్స్ చీఫ్ హెచ్‌ఆర్ గజేంద్ర చందేల్ తెలియజేశారు.
ఈ ఏడాది జనవరి నాటికి కంపెనీలో 2,628 మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్టు చెప్పారు. ఇందులో 1,952 షాప్ ఫ్లోర్‌లో పనిచేసేవారని, మొత్తం ఫ్యాక్టరీ ఉద్యోగులు 41,390 మందిలో ఇది 5 శాతమని వివరించారు. టాటా మోటార్స్‌లో ప్రస్తుతం మొత్తం 55,159 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ‘‘గత కొన్నేళ్లలో క్యాంపస్‌ల నుంచి ఎక్కువ మంది మహిళలను నియమించుకుంటున్నాం. 2018 బ్యాచ్‌ల నుంచి 25 శాతం మేర మహిళలనే నియమించుకోవాలన్న లక్ష్యంతో ఉన్నాం’’ అని చందేల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment