సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా విలీనం తరువాత నెం.1 స్థానం నుంచి ఎయిర్‌టెల్ కిందికి పడిపోయింది. వోడాఫోన్, ఐడియా మెగా మెర్జర్‌లో కీలకమైన ఆఖరి అంకమైన ఎన్‌సీఎల్‌టీ ఆమోదం కూడా లభించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ భారీ మెర్జర్ తరువాత ఆవిష‍్కరించిన కొత్త సంస్థ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఈ స్థానంలోకి దూసుకు వచ్చింది. 32.2శాతం వాటా, 408 మిలియన్ల వినియోగదారులతో అగ్రగామి సంస్థగా నిలిచింది. దీంతో 15ఏళ్లపాటు ధరిస్తూ వస్తున్న మార్కెట్ లీడర్ కిరీటాన్ని, నెం.1 స్థానాన్ని ఎయిర్‌టెల్ కోల్పోయింది.
కొత్త ఛైర్మన్ , కొత్త బోర్డు
ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా ఈ విలీన సంస్థకు ఛైర్మన్‌గా ఉంటారు. అలాగే 12 మంది డైరెక్టర్లతో (6 స్వతంత్ర డైరెక్టర్లు సహా) కొత్త బోర్డు ఏర్పాటు. అలాగే సీఈవోగా బాలేష్ శర్మ నియామకం. ఈ మేరకు ఇరు సంస్థలు శుక్రవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా 15,000 దుకాణాలను, 1.7 మిలియన్ల రిటైల్ టచ్ పాయింట్లు వొడాఫోన్ ఐడియా సొంతం. దేశంలో అతిపెద్ద సస్థగా అవతరించి చరిత్ర సృష్టించామని చైర్మన్ కుమార మంగళం వ్యాఖ్యానించారు. పరిణామం చెందుతున్న డిజిటల్, కనెక్టివిటీ అవసరాలను నెరవేర్చడానికి కొత్త ఉత్పాదనలు, సేవలతో తమ రిటైల్, వాణిజ్య కస్టమర్లకు అద్భుతమైన అనుభవాన్ని అందించనున్నామని కొత్త సంస్థ సీఈవో బాలేష్ శర్మ చెప్పారు. భారతదేశం అంతటా తొమ్మిది సర్కిళ్లలో కొత్త సంస్థ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. అలాగే ఐడియా సెల్యులార్ మేనేజింగ్ డైరెక్టర్ పదవినుంచి హిమాంశు కపానియా నేడు(ఆగస్టు 31, 2018) వైదొలగనున్నారు. కానీ కొత్త కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటారు.
మరోవైపు రెండవ అతిపెద్ద సంస్థగా ఉన్న వొడాఫోన్ జూలైలో రికార్డు స్థాయిలో ఏకంగా 6 లక్షలకు పైగా కొత్త కస్టమర్లను ఖాతాదారులుగా చేర్చుకుంది. ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే ఇదే అత్యధికం. మార్కెట్ లీడర్ భారతీ ఎయిర్‌టెల్ 3.13 లక్షల మందిని ఖాతాదారులుగా చేర్చుకుంది. జూలైలో వొడాఫోన్ ఇండియా 609,054 మందిని ఖాతాదారులుగా చేర్చుకోగా, భారతీ ఎయిర్‌టెల్ 313,284 మందిని చేర్చుకున్నట్టు సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) వెల్లడించింది. కొత్త వినియోగదారుల చేరికతో వోడాఫోన్ మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1004.08 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. అయితే ఐడియా సెల్యులార్ వినియోగదారుల బేస్ కేవలం 5,489 మాత్రమే పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment