నియంత్రణలు పాటిస్తేనే విదేశీ నిధులు!: భట్టాచార్య
కోల్‌కతా: విశ్వసనీయతను కొనసాగించడంతోపాటు విదేశీ నిధులను ఆకర్షించేందుకు బ్యాంకులు నియంత్రణ పరమైన నిబంధనలను అనుసరించాల్సిందేనని ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. ‘‘లిక్విడిటీ కవరేజ్ రేషియో, సీఆర్‌ఆర్, ఎస్‌ఎల్‌ఆర్, రుణాల వర్గీకరణ వంటి విధానాలను బ్యాంకులు పాటించాలి. దేశంలో నిధుల కొరత లేదని చెప్పలేం. కాబట్టి బ్యాంకులు ఈ ప్రమాణాల్ని పాటించాలి. విశ్వసనీయతను కాపాడుకుంటూ విదేశీ నిధులను రాబట్టాలి ’’ అని ఫిక్కీ నిర్వహించిన బ్యాంకింగ్ సదస్సులో అరుంధతి వ్యాఖ్యానించారు.
‘నేడు బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న అది పెద్ద సవాలు నిధుల లభ్యతే. అమెరికాకు చెందిన లేమన్ బ్రదర్స్ కుప్పకూలిపోవడమే ఈ పరిస్థితికి కారణం. అంతర్జాతీయంగా పునరుద్ధరించిన రుణాలను ఒత్తిడితో కూడిన ఆస్తులుగా అభివర్ణిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం పునరుద్ధరించబడిన వాటిని స్టాండర్డ్ ఆస్తులుగా పరిగణిస్తున్నారు’ అని ఆమె చెప్పారు.