
మూడో రోజూ క్షీణత...
♦ 128 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
♦ నిఫ్టీ 40 పాయింట్లు డౌన్
ముంబై: అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి పట్ల ఇన్వెస్టర్లలో తలెత్తిన అనుమానాల కారణంగా ప్రపంచ ట్రెండ్‌ను అనుసరిస్తూ భారత్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిసాయి. ఆర్థికాభివృద్ధి అంచనాలు తగ్గడంతో ప్రపంచ మార్కెట్లు బలహీనపడ్డాయని, ఇందుకుతోడు చమురు ధరల్లో ఒడుదుడుకుల కారణంగా దేశీయ మార్కెట్ క్షీణించిందని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 128 పాయింట్ల తగ్గుదలతో 25,102 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 40 పాయింట్ల క్షీణతతో 7,707 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
మెటల్ షేర్లలో అమ్మకాలు...
చైనా తయారీ రంగం మందగించిందన్న వార్తలతో లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో బేస్ మెటల్స్ ధరలు భారీగా తగ్గడంతో ఇక్కడ మెటల్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. టాటా స్టీల్, హిందాల్కో, వేదాంతలు 5 శాతంపైగా క్షీణించాయి. నాన్-సెన్సెక్స్ మెటల్ షేర్లలో సెయిల్ 8 శాతం పతనంకాగా, ఎన్‌ఎండీసీ 5 శాతం తగ్గింది. మరోవైపు గత నెలలో జేఎల్‌ఆర్ అమ్మకాలు అమెరికాలో క్షీణించాయన్న వార్తలతో టాటా మోటార్స్ 6 శాతంపైగా పడిపోయింది. సెన్సెక్స్‌లో అన్నింటికంటే అధికంగా ఆదాని పోర్ట్స్ షేరు 12 శాతం క్షీణించి రూ. 208 స్థాయికి దిగిపోయింది. క్రితం రోజు ఆదాని పోర్ట్స్ ప్రకటించిన ఫలితాల్లో ఇబిటా మార్జిన్లు అంచనాలకంటే తక్కువగా వున్నాయన్న కారణంగా ఈ షేరులో అమ్మకాలు జరిగాయి.
అక్షయ తృతీయకు ట్రేడింగ్ వేళలు పొడిగింపు
ఈ నెల 9న అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ ఈటీఎఫ్ ట్రేడింగ్ వేళల్ని రాత్రి 7 గంటలవరకూ పొడిగించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రకటించాయి. అన్ని విభాగాల్లోనూ సాయంత్రం 3.30 గంటలకు ట్రేడింగ్ ముగిసిన తర్వాత 4.30 గంటలకు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ట్రేడింగ్ పునర్‌ప్రారంభమై, 7 గంటలవరకూ కొనసాగుతుందని వివరించాయి.