శాంసంగ్ నుంచి కొత్త 4జీ ఫోన్లు
♦ గెలాక్సీ ఏ7, ఏ5 విడుదల
♦ 20కి చేరిన మోడళ్ల సంఖ్య
♦ కంపెనీ డెరైక్టర్ మను శర్మ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ 4జీ విభాగంలో దూకుడు మీద ఉంది. తాజాగా గెలాక్సీ ఏ7, గెలాక్సీ ఏ5 మోడళ్లను హైదరాబాద్ వేదికగా సోమవారం విడుదల చేసింది. దీంతో కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టిన 4జీ మోడళ్ల సంఖ్య 20కి చేరుకుంది. ఈ విభాగంలో సంస్థ మార్కెట్ వాటా 62 శాతానికి ఎగసిందని శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ బిజినెస్ డెరైక్టర్ మను శర్మ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. డిసెంబరు త్రైమాసికంలో భారత్‌కు దిగుమతైన స్మార్ట్‌ఫోన్లలో ఈ మోడళ్ల వాటా 60 శాతముందని చెప్పారు. టెల్కోలు 4జీ సేవలను విస్తరిస్తుండడంతో ఈ మోడళ్ల అమ్మకాలు ఊహించని స్థాయిలో ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం భారత్‌లో 55 కోట్ల ఫీచర్, 17 కోట్ల స్మార్ట్‌ఫోన్ వాడకందారులు ఉన్నారు. స్మార్ట్‌ఫోన్లలో 14 కోట్ల మంది 2జీ, 3జీ యూజర్లున్నారు. వీరు 4జీకి అప్‌గ్రేడ్ అవుతున్నారని మను శర్మ తెలిపారు.
ఇవీ ఏ7, ఏ5 ఫీచర్లు..
గెలాక్సీ ఏ7 మోడల్‌ను 5.5 అంగుళాల స్క్రీన్, 3 జీబీ ర్యామ్, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీతో తయారు చేశారు. ధర రూ.33,400 ఉంది. గెలాక్సీ ఏ5ను 5.2 అంగుళాల స్క్రీన్, 2 జీబీ ర్యామ్, 2,900 ఎంఏహెచ్ బ్యాటరీతో డిజైన్ చేశారు. ధర రూ.29,400 ఉంది. రెండు మోడళ్లలోనూ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, లాలీపాప్, 1.6 గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 128 జీబీ వరకు సపోర్ట్ చేసే మైక్రో ఎస్‌డీ స్లాట్, 7.3 మిల్లీమీటర్ల మందంతో రూపొందించారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో 13 ఎంపీ ఆటోఫోకస్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా పొందుపరిచారు. వైడ్ సెల్ఫీ, పామ్ సెల్ఫీ, బ్యూటీ ఫేస్ ఫీచర్ ఉంది. ఫింగర్ స్కానర్, ఫాస్ట్ చార్జింగ్ వంటివి అదనపు హంగులు. 300 ఎంబీపీఎస్ వరకు డౌన్‌లింక్, 50 ఎంబీపీఎస్ వరకు అప్‌లింక్ స్పీడ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.