న్యూఢిల్లీ : శాంసంగ్ తన ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై రెండు నెలల వ్యవధిలోనే మరోసారి ధరలను తగ్గించింది. గెలాక్సీ ఏ5(2017), గెలాక్సీ ఏ7(2017) స్మార్ట్ ఫోన్ ధరను రూ.4000 మేర తగ్గిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. మొత్తంగా కలిపి లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 10వేల రూపాయల మేర ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గాయి. లాంచ్ అయినప్పుడు రూ.27,990గా ఉన్న గెలాక్సీ ఏ5(2017), ప్రస్తుతం రూ.17,990కి అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా రూ.30,900గా ఉన్న గెలాక్సీ ఏ7(2017) స్మార్ట్‌ఫోన్, రూ.20,990కు దిగొచ్చింది. ఈ ఏడాది మార్చిలో ఈ స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్ వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆగస్టులో వీటి ధరను రూ.5000 మేర తగ్గించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ప్రధాన ఆకర్షణ తమ గెలాక్సీ ఎస్7- స్టయిల్ డిజైన్, తక్కువ వెలుతురు ఆప్టిమైజేషన్‌లో కెమెరా, కెమెరా యూఎక్స్, అదేవిధంగా దుమ్ము, నీళ్లను తట్టుకునే సామర్థ్యంతో ఏపీ68 రేటింగ్‌ను ఇవి కలిగి ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కేవలం స్క్రీన్ సైజ్, బ్యాటరీ సామర్థ్యంలో మాత్రమే విభిన్నంగా ఉంటాయి. మిగతా ఫీచర్లన్నీ దాదాపు సమానం.
గెలాక్సీ ఏ5(2017) స్మార్ట్‌ఫోన్ 5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 3000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండగా... గెలాక్సీ ఏ7(2017) స్మార్ట్‌ఫోన్ 5.7 అగుళాల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 3600 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల మిగతా ఫీచర్ల విషయానికి వస్తే.. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 256 జీబీ వరకు విస్తరణ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, శాంసంగ్ పే సపోర్టు, 1.9 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ఎస్‌ఓసీ, 16ఎంపీ రియర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment